ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి అవుతారా.?

మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అత్యంత అవమానకరమైన పరిస్థితుల్లో గులాబీ పార్టీ (ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పటి భారత్ రాష్ట్ర సమితి) నుంచి గెంటివేయబడిన సంగతి తెలిసిందే.

ఈటెల రాజేందర్‌ని తిరిగి గులాబీ పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరిగినా, ఆయన అందుకు ససేమిరా అన్నారు. పట్టుబట్టి మరీ, గజ్వేల్ టిక్కెట్టుని సాధించారు ఈటెల రాజేందర్, బీజేపీ నుంచి. గజ్వేల్‌లో కేసీయార్ మీదనే పోటీకి దిగుతున్నారాయన.

సో, పోటీ రసవత్తరంగా మారనుంది. ‘కేసీయార్‌ని వదిలేదే లేదు. తెలంగాణ రాజకీయాల నుంచి కేసీయార్‌ని తరిమికొడతా..’ అంటూ ఈటెల రాజేందర్ శపథం చేశారు. కేవలం శపథం చేయడం కాదు, కింది స్థాయిలో ‘వర్క్’ చేసుకుంటూ వెళ్ళిపోయారు. కేసీయార్‌కి వ్యతిరేకంగా కేవలం గజ్వేల్‌లోనే కాకుండా, గులాబీ పార్టీకి వ్యతిరేకంగా తెలంగాణ అంతటా ఈటెల రాజేందర్ ఓ వేవ్ తీసుకురాగలుగుతున్నారు.

దాంతో, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జోరందుకుంది. ఇది కూడా ఈటెల రాజేందర్ వ్యూహమే. గతంలో, ఈటెల రాజేందర్‌ని డైల్యూట్ చేయడానికి అప్పటి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నానా రకాల ప్రయత్నాలూ చేసి విఫలమయ్యారు.

ఈటెల రాజేందర్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోయారు. ముఖ్యమంత్రి పదవి విషయమై బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ స్పష్టమైన హామీ పొందారన్నది తాజా ఖబర్. గజ్వేల్‌లో కేసీయార్‌ని ఓడించగలిగితే, తెలంగాణ ముఖ్యమంత్రి పదవి తనదేనని ఈటెల రాజేందర్ బలంగా నమ్ముతున్నారు.

కానీ, తెలంగాణలో బీజేపీకి అంత సీన్ వుందా.? ఈ విషయమై ఈటెల రాజేందర్‌ కంటే ఎవరికి ఎక్కువ స్పష్టత వుంటుంది. కానీ, ఈటెల రాజేందర్ శక్తివంచన లేకుండా కృషి చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అదే చేస్తున్నారు కూడా.!