తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకటేమో గజ్వేల్ నియోజకవర్గం కాగా, ఇంకోటి కామారెడ్డి.! ఈ రెండు నియోజకవర్గాల్లో కేసీయార్ ఒక్క చోట నుంచే పోటీ చేస్తారన్నది తాజా ఖబర్.
చివరి నిమిషంలో చిన్నా చితకా మార్పులు వుండొచ్చని, కేసీయార్ ‘తమ అభ్యర్థుల లిస్టు’ని ప్రకటించినప్పుడే స్పష్టం చేసేశారనుకోండి.. అది వేరే సంగతి. కేసీయార్, రెండు చోట్ల నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన దరిమిలా, విపక్షాల నుంచి విమర్శలెక్కువయ్యాయి. గజ్వేల్ నుంచి పోటీ చేస్తే ఓడిపోతానన్న భయంతో, కామారెడ్డికి కేసీయార్ పారిపోయారని కాంగ్రెస్, బీజేపీ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా వుంటే, అటు కామారెడ్డీ కాదు.. ఇటు గజ్వేల్ కూడా కాదు.. ఈ రెండూ కాకుండా, ఇంకో కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకూ కేసీయార్ సమాలోచనలు చేస్తున్నారన్నది మరో ప్రచారం. కేసీయార్ ఎక్కడ పోటీ చేసినా, ఆయన మీద కోదండరామ్ బరిలోకి దిగుతారంటూ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరోపక్క, కేసీయార్ మీద పోటీకి విజయశాంతిని దించాలని బీజేపీ భావిస్తోంది. ‘నేనెక్కడినుంచి పోటీ చేస్తానన్నది బీజేపీ అధినాయకత్వం నిర్ణయిస్తుంది. అధినాయకత్వం నిర్ణయానికి నేను కట్టుబడి వుంటాను..’ అంటున్నారు విజయశాంతి. అయితే, కేసీయార్ మీద పోటీ చేస్తానని మాత్రం ఆమె ఇప్పటిదాకా ఎక్కడా చెప్పలేదు.
కోదండరామ్ గనుక కేసీయార్ మీద పోటీ చేస్తే.. అది కాంగ్రెస్ పార్టీ నుంచేనని దాదాపు స్పష్టత వచ్చేసినట్లే. తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ పాత్ర గురించి కొత్తగా చెప్పేదేముంది.? కొత్త రాజకీయ పార్టీని స్థాపించినా, కోదండరామ్ తన ఉనికిని రాజకీయంగా చాటుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారట.