108… ఈ నెంబర్ చూడగానే టక్కున గుర్తుకు వచ్చేది అంబులెన్స్. ఆపద సమయంలో ప్రాణాలను కాపాడే వాహనం. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ఏ ఆపద వచ్చినా దేవుడిలా వచ్చి ఆదుకునేది 108. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 108 లో ఉండాల్సిన సిబ్బంది లేక బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. 108లో డ్రైవర్ తోపాటు, పారామెడికల్ సిబ్బంది, ఈఎంటీ టెక్నిషియన్ ఉండాలి. కానీ సరైన సిబ్బంది లేక 108 ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. అంబులెన్స్ కు ఫోన్ చేస్తే ఉండాల్సిన సిబ్బంది లేక ఉన్నవారితోనే ఆసుపత్రులకు తీసుకుపోతుండటంతో పేషేంట్లు ఇబ్బందికి గురవుతున్నారు.
ఇబ్రహీంపట్నం శివారు నాగన్ పల్లికి చెందిన ఓ వ్యక్తికి జ్వరం, కడుపునొప్పి రావడంతో అత్యవసరంగా 108 కి ఫోన్ చేశారు. 108 వాహనం వచ్చింది కానీ అందులో డ్రైవర్ తప్పా ఎవరూ లేరు. అంటే అతన్ని ఆసుపత్రికి తీసుకుపోయే వరకు ఎటువంటి చికిత్స అందదు. వాస్తవానికి అందులో పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్ ఉండాలి వారికి ప్రథమ చికిత్స చేయాలి. కానీ అవేమి పట్టకుండా సిబ్బంది లేకపోవడంతో నిర్లక్ష్యంగానే తీసుకుపోతున్నారు. ఇలా అయితే తమ ప్రాణాలు గాలిలో కలుస్తాయని బాధితులు అంటున్నారు. గురువారం అర్దరాత్రి బాధితుడిని ఎటువంటి చికిత్స లేకుండా ఎలా తీసుకుపోతున్నారో చూడండి వీడియో.
108లో సరిపడ సిబ్బంది లేరని అందుకే ఇటువంటి సమస్యలు వస్తున్నాయని తెలుస్తోంది. 108 ఉద్యోగులు జీతాలు పెంచాలని సమ్మె చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. సిబ్బంది కొరతా కారణంగానే ఇటువంటి పరిస్థితి వచ్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆపదలో ఆదుకునే 108 ఆపదలో పడటంతో ఇబ్బందులు తలెత్తుతాయని వారంటున్నారు. వెంటనే ఉద్యోగ నియామకాలు చేసి 108ను కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.