రేవంత్ రెడ్డికి ఎంత పరిహరమిస్తారని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయాన రేవంత్ రెడ్డిని అక్రమంగా నిర్బంధించారని వేం నరేందర్ రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పరస్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే రేవంత్ ను అక్రమంగా నిర్బంధించారని అతని పరువుకు నష్టం కలిగేలా చేశారని రేవంత్ రెడ్డితో పాటు మరికొంత మంది పిటిషన్ వేశారు. ఈ కేసు పై విచారించిన కోర్టు అసలు రేవంత్ రెడ్డికి ఎంత పరిహారమిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటంటే…

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ కొడంగల్ నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చారు. అయితే కేసీఆర్ పర్యటన రోజే పోలీసుల తీరుకు నిరసనగా రేవంత్ రెడ్డి కొడంగల్ బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో ముందు జాగ్రత్తగా చర్యగా పోలీసులు రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేసి జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. దీంతో రేవంత్ రెడ్డిని అక్రమంగా నిర్బందించారని మరియు ఆచూకీ లేదని హైకోర్టులలో వేర్వేరుగా పిటిషన్లు దాఖలయ్యాయి. బుధవారం దీనికి సంబంధించి హైకోర్టులో భిన్న వాదనలు సాగాయి.

రేవంత్ రెడ్డి పరువుకు భంగం కలిగించినందుకు నష్టపరిహారం చెల్లించాలని రేవంత్ తరుపు న్యాయవాది వాదించారు. రేవంత్ ది అక్రమ నిర్భందం కాదని దీని పై అసలు విచారణ అనవసరమని ఏజీ ప్రసాద్ అన్నారు. ప్రభుత్వం కోరుతున్నట్టు కేసు మూసేస్తే పోలీసులు పిటిషనర్ తో వ్యవహరించినట్టుగానే ఇతరులతోనూ వ్యవహరిస్తారన్నారు. ప్రభుత్వం నుంచి తన క్లయింట్ కు నష్టపరిహారం ఇప్పించాలన్నారు. అది లక్ష రూపాయలైనా సరే లేక ఒక్క రూపాయి అయినా సరేనన్నారు. ఒక్క రూపాయి చెల్లించినా అభ్యంతరం లేదని పరిహారం చెల్లిస్తే ప్రభుత్వం తప్పు చేసినట్టు రుజువవుతుందన్నారు.

రేవంత్ రెడ్డి అరెస్టుకు దారి తీసిన పరిస్థితులకు సంబంధించిన నివేదికను కోర్టుకు అందజేస్తామని ఏజీ అన్నారు. ఇరువురి వాదనలు విన్న జస్టిస్ రాఘవేంద్ర సింగ్, జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ ల ధర్మాసనం విచారణను 25 వ తేదికి వాయిదా వేసింది.