‘తెలంగాణ కాంగ్రెస్‌ను నడిపించే నాయకులే లేరు’
‘ఆ పార్టీలో 11 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారు’
వారం పదిరోజుల క్రితం వరకూ కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు పెద్దఎత్తున చేసిన విమర్శలివి. జన సామాన్యంలోనూ కాంగ్రెస్‌ను ఒక్కతాటిపై నడిపించే నాయకుడు లేడనే అభిప్రాయం ఉండేది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత అంత కరిష్మా, కమాండ్ ఉన్న నేత లేకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్ అని విశ్లేషకులు నిన్నమొన్నటి వరకూ చెబుతూ ఉండేవారు.
కానీ ఉత్కంఠగా మారిన ఎన్నికల రణంలో కాంగ్రెస్ ఆ సమస్యను చంద్రబాబు ద్వారా అధికమించింది. బాబు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు అధినేతగా మారిపోయాడు. ప్రజాఫ్రంట్‌కు కోదండరాం నేతృత్వం వహిస్తాడని కాంగ్రెస్ సీనియర్లు చెప్పిన మాటలన్నీ గాల్లో కలిసిపోయాయి. కోదండరాం ఊసు ఎన్నికల్లో పెద్దగా లేకుండాపోయింది. ఎన్నికల తంతునంతా చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా మారి జవసత్వాలు అందిస్తున్నారు. రాహుల్ గాంధీ తర్వాత కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు చంద్రబాబే సూపర్ బాస్.
ఎన్నికల వ్యూహాలు, మీడియా వ్యవహారాలన్నీ బాబు చెప్పినట్లే జరుగుతున్నాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా కాంగ్రెస్ వృద్ధ జంబూకాలన్నీ ఆయన మాట కోసం ఎదురుచూస్తున్నాయి. హైదరాబాద్‌లో ఆదివారం చంద్రబాబు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, మహాకూటమిలోని ఇతర నేతలతో సమావేశమై ఎన్నికలపై సమీక్ష చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎవరెవరు ఏమి చేయాలి, ఎలా మాట్లాడాలి, పోలింగ్‌కు ముందు మూడురోజులు అత్యంత కీలకంగా ఎలా పనిచేయాలనే దానిపై బాబు వారికి దిశానిర్దేశం చేశాడు.
అంతేకాదు తనకు బాగా తెలిసిన ఎలక్షన్ మేనేజ్మెంట్ టెక్నిక్లను వారికి ఎప్పటికప్పుడు చెబుతున్నారు. టీడీపీ నాయకులతో ప్రతిరోజూ టెలీకాన్ఫరెన్స్‌ల్లో మాట్లాడినట్లు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులతో ఉదయమే టెలీకాన్ఫరెన్సులు నిర్వహిస్తూ ఆర్డర్లు పాస్ చేస్తున్నాడు. బాబు డైరెక్షన్ ప్రకారం పనిచేసేందుకు కాంగ్రెస్ సీనియర్లు ఉత్సుకతతో రంగంలోకి దిగారు. తమకు ఏమైనా ఇబ్బందులు వచ్చినా, అనుమానాలు వచ్చినా వారంతా ఇప్పుడు చంద్రబాబువైపే చూస్తుండడం విశేషం. ఇపుడు దాదాపు తెలంగాణ కాంగ్రెస్ చంద్రబాబు కంట్రోల్ లోకి వచ్చేసింది.
ఎన్నికల ప్రచారంలోనూ కాంగ్రెస్ నాయకులు చంద్రబాబు ఫొటో పెట్టుకుని తిరుగుతున్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లలో తమ నాయకులతోపాటు బాబు ఫొటోలను ప్రధానంగా ముద్రించి ప్రచారం చేసుకోవడం తెలంగాణ ఎన్నికల విశేషం.
అవసాన దశకు వచ్చిన కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వదిలేసింది. హైదరాబాద్‌లో వైఎస్ చేసిన పనులు, తెలంగాణలో ఆయన చేపట్టిన ప్రాజెక్టుల్ని కాంగ్రెస్ నాయకులే దగ్గరుండి మరీ చంద్రబాబు ఖాతాలో వేస్తున్నారు. అయితే, ఇక్కడొక తమాషా జరుగుతూ ఉంది.కాంగ్రెస్ పనులను తాను కొనసాగించానని, అలాగే తాను ప్రారంభించిన ప్రాజక్టులను, పథకాలను ఆ తర్వాత కాంగ్రెస్ కొనసాగించిందని బాబు చెబుతున్నారు.
150 సంవత్సరాల చరిత్ర ఉన్న తమదని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలోకి పోవడం ఆ పార్టీలోనే పలువురు సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నా, మరికొందరు చంద్రబాబు కాంగ్రెస్ ప్రాడక్టే నని సర్దుకు పోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో సూపర్ బాస్ చంద్రబాబే. బాబు ఒక్కడే ధీటుగా కెసియార్ ను ఎదుర్కొంటున్నాడని, బాబును చూసే కెసియార్ జడుసుకుంటున్నాడని పార్టీ మనుగడ కోసం ఎవరికి వారు సైలెంట్‌గా ఆయన్ను అనుసరించక తప్పదని అంటున్నారు.