సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ కు బ్యాడ్ లైట్ అడ్డంకిగా మారింది. మబ్బుపట్టి చిరుజల్లులు కురిశాయి. ఇంతలోనే వెలుతురు కూడా సరిగా లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను నిలిపి వేశారు. దీంతో మూడో రోజు ఆట నిలిపివేసిన సమయానికి ఆసీస్ 83.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది.
622 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ప్రారంభంలో మెరుగ్గానే ఆడింది. ఓపెనర్ హారీస్ 79 పరుగులు, ఖవాజా 27, లాబస్ చేంజ్ 38 పరుగులు చేశారు. మార్ష్ (8), హెడ్ (20), పైన్ (5) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. మిడిలార్డర్ ఘోర వైఫల్యం చెందింది. దీంతో ఆస్ట్రేలియా 198 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన బౌలర్ కమ్మిన్స్ (25 బ్యాటింగ్) మరోసారి బ్యాట్‌తో రాణించాడు. కమ్మిన్స్, హాండ్స్ కాంబ్ వికెట్లను నష్టపోకుండా ఆడారు. ఇదే సమయంలో వెలుతురు సరిగా లేకపోవడంతో మ్యాచ్ నిలిపేశారు.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. జడేజాకు రెండు, షమీకి ఒక వికెట్ దక్కాయి. ఆస్ట్రేలియా ప్రస్తుతం భారత్ కంటే 386 పరుగులు వెనుకబడి ఉంది.