గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార పర్వం ఊహించని మలుపులు తిరుగుతోంది. కూటమి ప్రభుత్వం వర్సెస్ విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య సాగుతున్న ఈ పోరులో అభివృద్ధి అంశాల కంటే భూముల వివాదమే ప్రధాన అస్త్రంగా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో ఉన్న మేయర్ అభ్యర్థి శ్రావణి కంటే, ఆమెకు వెన్నుదన్నుగా నిలిచిన విశాఖ ఎంపీ శ్రీ భరత్‌కు చెందిన గీతం విశ్వవిద్యాలయం భూముల చుట్టూనే ఇప్పుడు నగర రాజకీయం మొత్తం గిర్రాగిర్రా తిరుగుతోంది.
ఈ ఎన్నికల్లో సేవ్ వైజాగ్ అనే సరికొత్త నినాదంతో దూసుకుపోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి.. గీతం వర్సిటీ వ్యవహారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. తమకు నగర పీఠాన్ని అప్పగిస్తే రుషికొండ, ఎండాడ పరిసర ప్రాంతాల్లో గీతం సంస్థల ఆధీనంలో ఉన్న సుమారు ఐదు వేల కోట్ల రూపాయల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆమె ప్రకటించారు. నగర పాలన అనేది వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాలకు వేదిక కాకూడదని, ప్రజలకు జవాబుదారీగా ఉండే వ్యవస్థగా మార్చడమే తమ అజెండా అని చెప్తూ విసృతంగా చేస్తున్న ప్రచారం ప్రస్తుతం నగరంలోని విద్యావంతులను, తటస్థ ఓటర్లను తీవ్రంగా ఆలోచనలో పడేసింది.
ఇదే క్రమంలో గత కౌన్సిల్ ముగింపు దశలో జరిగిన రాజకీయ పరిణామాలను వైసీపీ ఓటర్ల ముందుకు తెస్తోంది. గతంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మేయర్ గొలగాని హరి వెంకటకుమారిని పదవి నుంచి అప్రజాస్వామికంగా తొలగించడం వెనుక ఎంపీ శ్రీ భరత్ ఒత్తిళ్లే కారణమని విపక్షం ఆరోపిస్తోంది. గీతం వర్సిటీ భూములను నామమాత్రపు ధరలకే క్రమబద్ధీకరించే తీర్మానానికి అప్పట్లో కౌన్సిల్ ఆమోదం తెలపడమే దీనికి నిదర్శనమని, నగర పాలనపై పట్టు సాధించేందుకే ఈ మేయర్ మార్పు డ్రామా నడిచిందని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది.
ఈ ఆరోపణలపై విశాఖ ఎంపీ శ్రీ భరత్ తీవ్రంగా స్పందిస్తూ కూటమి తరఫున కౌంటర్ ఎటాక్ ప్రారంభించారు. విపక్షాలు చేస్తున్న ‘సేవ్ వైజాగ్’ ప్రచారాన్ని అవాస్తవంగా కొట్టిపారేసిన ఆయన.. బురదజల్లే రాజకీయాలు చేయడంలో వైసీపీ ఆరితేరిపోయిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవల వల్ల విశాఖకు పెద్ద ఎత్తున అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయని, నగర ప్రతిష్టను దెబ్బతీసేందుకే విపక్షాలు ఇలాంటి దుష్ప్రచారాలకు తెరలేపాయని స్పష్టం చేశారు. ఏది ఏమైనా, పోలింగ్ సమయం దగ్గరపడుతున్న వేళ ఈ ఐదు వేల కోట్ల భూముల పంచాయితీ విశాఖ ఓటర్ల తీర్పును ఎంతవరకు ప్రభావితం చేస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.