దొంగ ఓటు వేసిన జనసేన ఎమ్మెల్యే..!

విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్‌లో అధికార కూటమికి చెందిన ఒక ప్రజాప్రతినిధి వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్వయంగా ఒక వార్డులో దొంగ ఓటు వేయడం స్థానికంగా కలకలం రేపింది. జీవీఎంసీ పరిధిలోని ఓటర్ల జాబితా ప్రకారం, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌కు 117వ వార్డులో ఓటు హక్కు ఉంది.

అయితే, ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో ఆయన 117వ వార్డును వదిలిపెట్టి, 115వ వార్డుకు వెళ్లి అక్కడ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 117వ వార్డులో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నారు. కాగా, 115వ వార్డులో జనసేన తరఫున పోటీ చేస్తున్న తన ముఖ్య అనుచరుడికి మద్దతు పలకడం కోసం, అక్కడ ఓటు లేకపోయినా రమేష్ వెళ్లడం గమనార్హం.

ఈ క్రమంలో ఓటర్ల జాబితాలో ఆయన పేరు లేనప్పటికీ, ఎన్నికల పోలింగ్ కేంద్రంలోని రిటర్నింగ్ అధికారి స్వయంగా దగ్గరుండి ఎమ్మెల్యేకు బ్యాలెట్ పత్రాన్ని అందించి, ఓటు వేయించడం తీవ్ర అభ్యంతరాలకు దారితీసింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఓటింగ్ ప్రక్రియలో ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే ఈ రకంగా దొంగ ఓటు వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు మరియు స్థానిక ఓటర్లు ఈ ఉదంతంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఎమ్మెల్యేపై, సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.