టీడీపీకి గుడ్ బై.. వైసీపీలో మేయర్ సీటు ఫిక్స్..?

స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీతో దశాబ్దాలుగా అనుబంధం ఉన్న సీనియర్ నాయకురాలు, శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సుదీర్ఘకాలం పాటు పార్టీకి సేవలు అందించినప్పటికీ, సొంత పార్టీలోనే తమ కుటుంబానికి తీవ్ర అన్యాయం, అవమానాలు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఈ పరిణామంతో సిక్కోలు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

దివంగత మాజీ మంత్రి గుండా అప్పలసూర్యనారాయణ సతిమణైన లక్ష్మీదేవి.. భర్త మరణానంతరం క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో శ్రీకాకుళం మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా, వైస్ ఛైర్‌పర్సన్‌గా సేవలందించిన ఆమె, 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుపై భారీ మెజారిటీతో విజయం సాధించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. గుండా కుటుంబానికి శ్రీకాకుళం పట్టణంలో బలమైన క్యాడర్, ప్రజాదరణ ఉందనే గుర్తింపు ఉంది.

అయితే, గత కొంతకాలంగా స్థానిక టీడీపీ నియోజకవర్గ నాయకత్వంతో గుండా కుటుంబానికి తీవ్ర ఆధిపత్య పోరు సాగుతోంది. దివంగత అప్పలసూర్యనారాయణ విగ్రహావిష్కరణ ప్రక్రియలో ఎదురైన అడ్డంకులు, ఇటీవల శ్రీకాకుళం నగరపాలక సంస్థ మేయర్ స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడం ఆమెను తీవ్ర నిరాశకు గురిచేసింది. దశాబ్దాల తరబడి పార్టీ కోసం కష్టపడిన తమను పక్కనబెట్టారనే బాధతోనే ఆమె కంటితడి పెడుతూ పసుపు కండువా తీసివేశారని అనుచరులు చెబుతున్నారు.

టీడీపీ అసంతృప్తులను వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్న వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు తెరవెనుక నడిపిన మంత్రాంగంతో గుండా లక్ష్మీదేవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు. రేపో మాపో ఆమె వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకుని, ఆ పార్టీ తరఫున శ్రీకాకుళం కార్పొరేషన్ మేయర్ బరిలో నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్థానిక పోరు ముందు సిక్కోలులో ఈ మార్పులు వైసీపీకి రాజకీయంగా కొత్త బలాన్ని ఇచ్చేలా కనిపిస్తున్నాయి.