మహా నేత‌కు ఘ‌న నివాళి..`నాలో నాతో వైఎస్సార్ `ఆవిష్క‌ర‌ణ‌

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి 71వ జ‌యంతి సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో ఈరోజు జ‌గ‌న్ క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ముందుగా జ‌గ‌న్ ఫ్యామిలీతో ఇడుపులపాయ‌లోని వైఎస్సార్ ఘాట్ వ‌ద్ద నివాళులు అర్పించారు. అనంత‌రం కాసేపు ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌లు నిర్వ‌హించారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు వెంట ఉన్నారు. ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం వైఎస్సార్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ ర‌చించిన `నాలో నాతో వైఎస్సార్` అనే పుస్త‌కాన్ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆవిష్క‌రించారు. తండ్రి జయంతి రోజు త‌ల్లి ర‌చించిన పుస్త‌కాన్ని త‌న చేతుల మీదుగా ఆవిష్క‌రించ‌డం ప‌ట్ల జ‌గ‌న్ సంతోషం వ్య‌క్తం చేసారు.

ఆ స‌మయంలో త‌ల్లి విజ‌య‌మ్మ‌ను హ‌త్తుకుని జ‌గ‌న్ భావోద్వేగానికి గుర‌య్యారు. అలాగే తండ్రి జ‌యంతి సంద‌ర్భంగా జ‌గ‌న్ ప‌లు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న కార్య‌క‌లాపాల్లొ పొల్గొంటారు. గ్రామీణ ప్రాంత పేద ప్ర‌జ‌ల‌కు సాంకేతిక విద్య‌ను అందించేందుకు ఆర్ కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో 139 కోట్ల రూపాయ‌ల‌తో నిర్మించిన ఇంజ‌నీరింగ్ భ‌వ‌నాల‌ను సీఎం ప్రారంభిస్తారు. అలాగే ఇడుపుల పాయ‌లోని నెమ‌ళ్ల పార్క్ ప‌క్క‌న మూడు మెగావాట్ల సామ‌ర్ధ్యంతో రెస్కో కొల‌బ్రేష‌న్ సిస్ట‌మ్ తో సోలార్ విద్యుత్ తో నిర్మించిన ప్లాంట్ ను కూడా ఆవిష్క‌రించ‌నున్నారు. ఆరేక్ వ్యాలీ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహ‌విష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం కూడా జ‌గ‌న్ చేతుల మీదుగా జ‌ర‌గ‌నుంది. అలాగే ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ కంప్యూట‌ర్ సెంట‌ర్ కు, అక్క‌డే వైఎస్సార్ ఆడిటోరియంకు శంకుస్థాప‌న చేప‌ట్ట‌నున్నారు. అలాగే క‌డ‌ప జిల్లాలో ఇంకా ప‌లు అభివృద్ది ప‌నుల్లో సీఎం పాల్గొంటారు.