YS Vivekananda Reddy : వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు, ఎందుకు చంపారంటే.!

YS Vivekananda Reddy : మాజీ ఎంపీ, మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి 2019 ఎన్నికల సమయంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటిదాకా ఈ కేసు మిస్టరీ అలాగే కొనసాగుతూ వుంది.

ఎవరు చంపారు.? ఎందుకు చంపారు.? అన్నదానిపై స్పష్టత రావడానికి ఇంకెన్నాళ్ళు పడుతుందో ఏమో.!
ప్రస్తుతం వైఎస్ వివేకా డెత్ మిస్టరీని తేల్చేందుకు సీబీఐ తన పని తాను చేసుకుపోతోంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై అనుమానాల్ని సీబీఐ వ్యక్తం చేస్తోందంటూ ఓ చార్జి షీటుని మీడియా వెలికి తీసింది. చంపేసి, గుండె పోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం జరిగిందన్నది సీబీఐ వాదన. అందులో నిజం లేకపోలేదు కూడా.

తొలుత వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్లే మీడియాలో కథనాలొచ్చాయి. ఆ తర్వాత కాస్సేపటికే వివేకానందరెడ్డి శరీరంపై బలమైన గాయాలు బయటపడ్డాయి. ఆ గాయాలకు కట్లు కట్టేసి, రక్తపు మరకలు తుడిచేసి.. చాలా చాలా చేసేశారు కొందరు. ఆ కొందరు ఎవరు.? ఎందుకు అలా చేశారు.? అంటే, అదో పెద్ద కథ.

అసలు కథంతా అందులోనే వుంది. కిరాతకంగా జరిగిన హత్యను కాస్తా గుండెపోటుగా ఎలా మలచారన్నదే కీలకం. ఇంతవరకు ఆ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. వివేకా హత్య వెనుక టీడీపీ హస్తం వుందని వైసీపీ ఆరోపించింది. కాదు కాదు, వైసీపీనే వివేకానందరెడ్డిని చంపేసి, ఎన్నికల్లో ఆ అంశాన్ని వాడేసుకుందని టీడీపీ ఎదురుదాడికి దిగింది.

నిజానికి, అటు వైసీపీ.. ఇటు టీడీపీకి చెందిన కీలక నేతల్ని గనుక సీబీఐ అదుపులోకి తీసుకుని విచారణ చేసి వుంటే నిజాలు బయటకు వచ్చేవన్న వాదనా లేకపోలేదు. ఎవరి గోల వారిదే. వివేకానందరెడ్డి హత్యకు గురై మూడేళ్ళు పూర్తవుతోంది. ఇంతవరకు ఈ కేసు మిస్టరీ వీడలేదంటే మన రాష్ట్రంలో, దేశంలో వ్యవస్థలెలా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.

సీబీఐ తాజాగా దాఖలు చేసిందని చెప్పబడుతోన్న చార్జి షీటు కూడా రాజకీయ ప్రకపంనలు సృష్టిస్తోంది. చంపిందెవరు, చంపించిందెవరన్నదానిపై సీబీఐ స్పష్టత ఇస్తే సరిపోదు, న్యాయస్థానాలు ధృవీకరించాలి. అప్పటిదాకా ఈ రాజకీయ యాగీ కొనసాగుతుంది.