బీజేపీపై షర్మిలకు అంత సాఫ్ట్ కార్నర్ ఎందుకు.?

Ys Sharmila's Soft Corner On BJP

Ys Sharmila's Soft Corner On BJP

తన రాజకీయ జీవితం కోసం ఈటెల రాజేందర్ బీజేపీలో చేరాలనే నిర్ణయం మంచిదేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో కొత్త పార్టీ పెట్టనున్న వైఎస్ షర్మిల. ఈటెల ముందు మరో ఆప్షన్ కూడా లేదని షర్మిల అభిప్రాయపడటం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో వైసీపీ – బీజేపీ మధ్య తెరవెనుకాల అవగాహన వుందనే ప్రచారం జరుగుతోన్న విషయం విదితమే.

షర్మిల కూడా అదే దారిలో పయనిస్తున్నారని అర్థం చేసుకోవాలేమో. లేకపోతే, ‘జాతీయ పార్టీల వల్ల రాష్ట్రాలకు ప్రయోజనం లేదు.. ప్రాంతీయ పార్టీలతోనే మేలు..’ అని వ్యాఖ్యానించిన షర్మిల, ఈటెల వ్యవహారంపై బీజేపీని టచ్ చేస్తూ వ్యాఖ్యానించాల్సిన అవసరమేమొచ్చింది.? ఇంకా షర్మిల పార్టీకి పేరు, జెండా, ఎజెండా.. ఇవేవీ ఖరారు కాలేదు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. అనే పేరు దాదాపు ఖాయమైందని అంటున్నారు. మరోపక్క, వైఎస్ఎస్ఆర్ పార్టీ.. అనే ఇంకో పేరు కూడా ప్రచారంలోకి వస్తోంది. వచ్చే నెలలో షర్మిల తన పార్టీ పేరునీ, జెండానీ, ఎజెండానీ ప్రకటించబోతున్నారు.

ఈ మేరకు పార్టీ మద్దతుదారులు, వైఎస్సార్ అభిమానులు.. తమ తమ అభిప్రాయాల్ని పంపాలంటూ షర్మిల కోరారు. కార్యకర్తలే నాయకులని సెలవిచ్చారు షర్మిల. అన్ని రాజకీయ పార్టీలూ చెప్పే మాటే ఇది. ఇంకోపక్క, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు షర్మిల పార్టీ నుంచి ఆహ్వానాలు వెళుతున్నా, అట్నుంచి స్పందన ప్రస్తుతానికి అస్సలేమాత్రం కనిపించడంలేదు.

ఇక, తెలంగాణలోని అధికార పార్టీపై షర్మిల ఘాటైన విమర్శలు చేస్తున్నా, ఆ విమర్శల్లో చిత్తశుద్ధి లేదన్న అనుమానాలు చాలామందికి కలుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితికి మేలు చేయడానికే షర్మిల పార్టీ పెట్టారంటూ కాంగ్రెస్ నుంచి విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, షర్మిల పార్టీ కారణంగా గులాబీ పార్టీ కంటే ఎక్కువ లాభం కమలం పార్టీకే కలగొచ్చన్నది ఓ అంచనా.