పొలిటిక‌ల్ పార్టీల‌కు పాట‌లు రాస్తే అలాగే ఉంటుందా?

ఉద‌యాన్నే లేచి దిన‌స‌రి కూలీ గ‌డ్డ మీద‌కు వెళ్లి ఎవ‌రు ప‌నికి పిలిస్తే ఆ ప‌నికి వెళ్తాడు. సాయంత్రం వ‌ర‌కూ ఆ ప‌ని పూర్తిచేసి వ‌చ్చేట‌ప్పుడు కూలీ తీసుకుని ఇంటికొస్తాడు. ఇండ‌స్ర్టీలో క్రింద స్థాయి ఆర్టిస్టులు..టెక్నీషియ‌న్ల జీవన విధానం అంతే. కూలీని త‌క్కువ చేయ‌డానికి లేదు. ఆర్టిస్ట్ ని ఎక్కువ చేయ‌డానికి లేదీక్క‌డ‌. అలాగే ఇండ‌స్ర్టీలో పాట‌ల ర‌చ‌యిత‌లు కూడా అంతే. త‌గిన పారితోషికం ఇస్తే చిన్న ..పెద్ద అనే తార‌త‌మ్యం లేకుండా ఏ సినిమాకైనా ప‌నిచేస్తారు. అలాంటి వాళ్ల‌లో సుద్దాల అశోక్ తేజ కూడా ఒక‌రు. ఆయ‌న‌ శంక‌ర్ లాంటి అగ్ర ద‌ర్శ‌కుడి సినిమాకు ప‌నిచేసారు..చిన్న స్థాయి ద‌ర్శ‌కుడు సినిమాల‌కు ఆయ‌న పాట‌లు ర‌చించారు.

ఆయ‌న‌కు కావాల్సింది ప‌ని. క‌ష్టం విలువ తెలిసిన‌వాడు ఎవ‌రైనా దానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లమే ఆశిస్తారు. అలాగే సుద్దాల అశోక్ తేజ త‌న వృత్తిలో భాగంగా ఏపీలోని రాజ‌కీయ పార్టీల‌కు పాట‌లు రాసారు. కానీ ఇక్క‌డ మాత్రం సీన్ వేరేగా ఉంది. ఒక నాయ‌కుడికి పాట‌లు రాసిన‌ప్పుడు మ‌రో నాయ‌కుడిగా పాట‌లు రాయ‌కూడ‌ద‌ని కొంత మంది నెటి జ‌నులు వితండ వాదం చేస్తున్నారు. వైకాపా ఎన్నికల ప్ర‌చారంలో భాగంగా రావాలి జ‌గ‌న్ కావాలి జ‌గ‌న్ పాట ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. ఆ పాట రాసింది సుద్దాల అశోక‌తేజ‌. శ‌క్తికాంత్ ఈ పాట‌కు సంగీతం అందించాడు. ఇప్పుడీ పాట సుద్దాల‌ని ఇర‌కాటంలో పెట్టేసింది.

వైకాపా-టీడీపీ అభిమానులు ఈ పాట విష‌యంలో త‌న్నుకుంటున్నారు. గ‌తంలో టీడీపీకి కూడా పాట‌లు రాశార‌ని ఆ పార్టీ అభిమానులు సుద్దాల‌ని ఇరికించే ప్ర‌య‌త్నం చేసారు. కానీ ఈ విష‌యం వైకాపా వాళ్ల‌కు తెలియ‌ద‌ని పుల్ల పెట్టారు. దీంతో ఇరు పార్టీల వారు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫైటింగ్ చేస్తున్నారు. ఈ వార్ ని సుద్దాల చ‌ల్లార్చే ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లించ‌లేదు. 1977 లో టీడీపీకి `త‌ర‌లుదాం రండి మ‌న జ‌న్మ భూమికి` అనే పాట‌ను రాసిన‌ట్లు సుద్దాల గుర్తు చేసారు. ఏపీలో రాజ‌కీయ పార్టీల‌కు పాట‌లు రాసినా…ఉద్దేశ పూర్వ‌కంగా ఏప‌ని చేయ‌క‌పోయినా వివాదాలు మెడ‌కు చుట్టుకుంటాయి అన‌డానికి ఇది మ‌రో ఉదాహ‌ర‌ణ‌.