Early Polls In AP : ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలొస్తే ఎవరికి లాభం.?

Early Polls In AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయా.? జరిగితే ఎవరికి లాభం.? ఈ అంశంపై గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన రీతిలో చర్చ జరుగుతూనే వుంది. నో డౌట్, అధికార వైసీపీనే ఇంకోసారి అధికారం నిలబెట్టుకుంటుందని మెజార్టీ విశ్లేషణలు చెబుతున్నాయి.

అయితే, వైసీపీకి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో వచ్చిన స్థాయిలో సీట్లు రాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయినాగానీ, 100 సీట్లకు తక్కువ కాకుండా వైసీపీ సత్తా చాటబోతోందన్నదే అందరి అంచనా.

టీడీపీ లెక్కలు మాత్రం వేరేలా వున్నాయి. ఈసారి 100కి పైన సీట్లు తామే కొల్లగొడతామంటోంది. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత చాలా ఎక్కువగా వుందనీ, దాన్ని పైకి కనబడనీయకుండా వైసీపీ మేనేజ్ చేస్తూ వస్తుందనీ, అది బలుపు కాదు.. వాపు అనే విషయం ముందు ముందు తేలబోతోందనీ టీడీపీ నేతలు చెబుతున్నారు.

మరోపక్క, జనసేన పార్టీ మాత్రం ప్రజా చైతన్యం చాపకింద నీరులా విస్తరిస్తోందనీ, ఈసారి టీడీపీ అలాగే వైసీపీ.. ఈ రెండిటికీ షాకివ్వడానికి ప్రజలు సిద్ధంగా వున్నారని అంటోంది. టీడీపీ, వైసీపీ, జనసేన.. ఈ పార్టీల వాదన ఇలా వుంటే, తగుదునమ్మా.. అన్నట్టుగా బీజేపీ కూడా తామూ బలపడ్డామని అంటోంది. అయితే, బీజేపీ లెక్కల్లో బీజేపీ ప్లస్ జనసేన.. అధికారంలోకి వస్తాయట.

ఈ విశ్లేషణల సంగతి పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోదు. ఎందుకంటే, రాజధాని సహా చాలా అంశాలు అధికార పార్టీకి తలనొప్పి కాబోతున్నాయి. రానున్న రెండేళ్ళలో ఆయా అంశాలపై పూర్తి స్పష్టత ఇచ్చేందుకు పూర్తిస్థాయిలో సమయాన్ని సద్వినియోగం చేసుకోనుంది వైసీపీ.

సో, ఈలోగా టీడీపీ, జనసేన ప్లస్ బీజేపీ.. ముందస్తు ఎన్నికల కోసం ఎదురు చూస్తూ వుండాల్సిందే.. అదీ 2024 సార్వత్రిక ఎన్నికల దాకా ఆ ఎదురు చూపులు తప్పేలా లేవ్. అనుకోని పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం.. వైసీపీకి అంత ఈజీ కాదు.. అలాగని టీడీపీ, ఇతర పార్టీలకు అవకాశం వుందనీ కాదు.