ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కు అందరూ సమానులే. కేటగిరిని బట్టి ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కల్పన అనేది ఒకటి ఉంది. దాన్ని బట్టే ప్రభుత్వాలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రిలీజ్ చేసి భర్తీ చేసుకుంటాయి. ఏపీలో ఉన్న ఎండోమెంట్ డిపార్ట్ మెంట్లు సైతం ఇదే విధంగా రిక్రూట్ మెంట్లు ఇప్పటివరకూ జరిపాయి. అయితే ప్రస్తుతం టీటీటీ (తిరుమల తిరుపతి దేవస్థానం) రిక్రూట్ మెంట్ల శైలి మార్చినట్లు కనిపిస్తోంది. తాజాగా టీటీడీ 47 గార్డెనింగ్ ఉద్యోగాలకు నొటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 75 శాతం ఉద్యోగాలు కేవలం కడప జిల్లా వాసులుకేనని..మిగిలిన 25 శాతం మిగతా అన్ని జిల్లాల వారు కలిసి పోటీ పడాల్సి ఉంటుందని నొటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఉద్యోగాలకు అర్హత 5వ తరగతి, రెండేళ్ల పాటు గార్డెనింగ్ అలో అనుభవం ఉండాలి అని ప్రకటించారు. అయితే కడప జిల్లాకు 75 శాతం కేటాయించడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకూ టీటీడీ దేవస్థానం ఇలా నొటిఫికేషన్ ఎప్పుడూ జారీ చేయలేదు. రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న అభ్యర్ధులంతా సమాన ప్రాతిపదికనే రిక్రూట్ మెంట్ నిర్వహించింది. కానీ ఇప్పుడు ఆ ఉద్యోగాల్లో 75 శాతం కడప జిల్లాకి కేటాయించడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. నోటిఫికేషన్ ఇలా ఎందుకు జారీ చేసారో వివరణ ఇవ్వాలని మిగతా జిల్లాల అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప అని అందుకే జిల్లా ప్రీతి చూపిస్తున్నారా? అని ప్రతిపక్ష పార్టీ మండిపడుతోంది.
ప్రస్తుతం టీటీడీ చైర్మన్ గా వై. వి సుబ్బారెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బాబాయ్. ఆయనకు బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి కొండపై అన్యమత ప్రచారం జరుగుతుందని..దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవడం జరిగింది. తాజాగా ఉద్యోగాల్లో కడప జిల్లాకు పెద్ద పీట వేయడంతో సుబ్బారెడ్డిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి టీటీడీ చైర్మన్ వెంటనే వివరణ ఇవ్వాలని…నొటిఫికేషన్ వెనక్కి తీసుకుని అభ్యర్ధులందరికీ సమానత్వంతో కూడిన కొత్త నోటిఫికేషన్ మిగతా నొటిఫికేషన్ల తరహాలోనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.