తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ టికెట్లు, సేవల కోటా విడుదల తేదీలు ఇవే..!

తిరుమల శ్రీ‌వారి దర్శనానికి ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, వర్చువల్ సేవలు, ప్రత్యేక దర్శనాలు అలాగే తిరుమల–తిరుపతిలోని వసతి గదుల కోటా విడుదలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. భక్తులు తప్పనిసరిగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.

శ్రీ‌వారి నిత్య ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన ఏప్రిల్ నెల కోటాను జనవరి 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ సేవల కోసం ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో పాల్గొనాలనుకునే భక్తులు జనవరి 21 ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. డిప్ ద్వారా ఎంపికైన భక్తులు జనవరి 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటలలోపు టికెట్ మొత్తం చెల్లిస్తే, వారికి సేవా టికెట్లు ఖరారు కానున్నాయి.

అదేవిధంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీ‌వారి సాలకట్ల వసంతోత్సవాల టికెట్లను జనవరి 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు మరియు వాటికి అనుసంధానమైన దర్శన స్లాట్ల కోటాను కూడా టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానుంది.

భక్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను జనవరి 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు అదే రోజు ఉదయం 11 గంటలకు అందుబాటులోకి వస్తాయి. ఇక వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను జనవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

సాధారణ భక్తుల కోసం ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జనవరి 24న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల మరియు తిరుపతిలోని వసతి గదుల కోటాను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే మార్చి నెలకు సంబంధించిన శ్రీ‌వారి సేవా, పరకామణి సేవల కోటాను జనవరి 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. భక్తులు ఎలాంటి మధ్యవర్తులను ఆశ్రయించకుండా https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లు, సేవలను బుక్ చేసుకోవాలని టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేసింది.