టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ: దరఖాస్తుల ఉద్యమం షురూ..

‘ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు అర్హులైన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి ప్రభుత్వానికి పంపేందుకు బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ చేపట్టిన దరఖాస్తుల ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది..’ అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఓ ట్వీటేశారు. ఇందులో తప్పేముంది.? ఆ దరఖాస్తుల్ని ప్రభుత్వం పరిశీలిస్తుందా.? లేదా.? అన్నది వేరే చర్చ. అసలు దరఖాస్తులే పంపకూడదంటే ఎలా.? మంత్రి కేటీయార్ ఈ ట్వీటుపై స్పందించారు. ‘ప్రధాని నరేంద్ర మోడీ గతంలో ఒక్కో కుటుంబానికీ 15 లక్షలు ఇస్తామని చెప్పారు. దీనికి సంబంధించి అర్హులైన తెలంగాణ ప్రజలతా బీజేపీ నేతలకు దరఖాస్తులు ఇవ్వాలి..’ అంటూ కేటీయార్ ట్వీటేశారు. ‘జన్ ధన్.. ధనా ధన్..’ అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు కేటీయార్.

‘అసలు మేమెప్పుడు 15 లక్షలు ఒక్కో కుటుంబానికి ఇస్తామని చెప్పాం.?’ అన్నది బీజేపీ వాదన. చెప్పకపోవడమేంటి.? విదేశాల్లోంచి నల్లధనాన్ని తీసుకొస్తామనీ, అలా చేయడం ద్వారా దేశంలో ప్రతి కుటుంబం ఖాతాలో 15 లక్షలు వేయొచ్చనీ బీజేపీనే నినదించింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, కీలకమైన అంశాలకు సంబంధించి నాలిక మడతేయడం అన్నది బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై బీజేపీ తీరు ఇందుకు నిలువెత్తు నిదర్శనం. అయితే, తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. తెలంగాణ రాష్ట్రంలో దళితుడే తొలి ముఖ్యమంత్రి.. అని కేసీయార్, ఉద్యమ సమయంలో చెప్పారు. కానీ, ఆయనే ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు.. మాట మీద నిలబడితే, భారతదేశం ఎందుకిలా దశాబ్దాలుగా ‘అభివృద్ధి చెందుతున్న దేశంగానే’ మిగిలిపోతుందట.?