గ్రేటర్ ఎన్నికలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు దాడికి దిగుతున్నారు. ప్రధానంగా తెరాస, బీజేపీ పార్టీల నడుమ మాటల యుద్ధం నడుస్తోంది. తెరాస నాయకులు ఒకటి అంటే బీజేపీ నేతలు రెండు మాటలు విసురుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలవడంతో కొండంత బలం పుంజుకున్న భారతీయ జనతా పార్టీ అనేక ఎన్నికల్లో విజయం తమదే అన్న ధీమాతో ముందుకెళుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చాలా దూకుడుగా వెళ్తున్నారు. ప్రధానంగా కేసీఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఎన్నికల్లో నెగ్గుకురావడానికి బీజేపీ ఎంచుకున్న అంశం తెరాస, ఏఐఎంఐఎం పార్టీల స్నేహం. ఈ రెండు పార్టీల సఖ్యతను ఎలివేట్ చేసి పెద్ద ఎత్తున హిందూ ఓట్లను కొల్లగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
అందులో భాగంగానే చార్మినార్ ప్రాంతంలో పాగా వేయడానికి పెద్ద ప్లాన్ వేసుకున్నారు. వరద సాయాన్ని ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈసీ నిలిపివేయడాన్ని బీజేపీ చర్యగా విమర్శించారు తెరాస నేతలు. దీంతో బండి సంజయ్ దమ్ముంటే కేసీఆర్ వచ్చి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసి బీజేపీయే వరద సహాయాన్ని నిలిపివేయించిందని, తమకు ఎలాంటి సంబంధం లేదని ఒట్టు వేయాలని, తానూ వచ్చి వేస్తానని అన్నారు. అన్న ప్రకారమే వెళ్లి ఆలయంలో ఒట్టు పెట్టారు. ఫోర్జరీ సంతకాలంతో నకిలీ లేఖలు సృష్టిస్తున్నారని, ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత కారణంగా ఈ తప్పుడు ప్రచారాలు సృష్టిస్తున్నారని అన్నారు. అంతకుముందు ఇవి దేశభక్తులకు, దేశ ద్రోహులకు జరుగుతున్న ఎన్నికలని, కేసీర్ పక్క దేశద్రోహి అని వ్యాఖ్యానించారు బండి సంజయ్.
ఎప్పుడెప్పుడు బీజేపీ నేతలు దొరుకుతారా అని కేసీఆర్ ఎదురుచూస్తున్న తరుణంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యాలను ఆయన మీదకే ప్రయోగించడానికి రెడీ అయింది తెరాస. తెరాస ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఎన్నికల సంఘానికి పిర్యాధు చేశారు. కేసీఆర్‌ను దేశద్రోహి అని వ్యాఖ్యానించిన బండి సంజయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. ప్రశాంత నగరమైన హైదరాబాద్లో మత విద్వేషాలు రెచ్చగోట్టాలని బీజేపీ చూస్తున్నట్టు ఆరోపించారు. అసలే బీజేపీ మీద మతతత్వ పార్టీ అని, ముస్లిం వ్యతిరేక పార్టీ అనే ముద్రలున్నాయి. వీటి నేపథ్యంలో బండి సంజయ్ ముఖ్యమంత్రిని దేశద్రోహి అంటూ వ్యాఖ్యానించడం, ఎంఐఎం పార్టీతో స్నేహంగా ఉండటాన్ని తప్పుబట్టడం, తెరాస ఈసీ పిర్యాధు చేయడం లాంటివి ఆ ఆరోపణల ప్రభావాన్ని పెంచే ప్రమాదం లేకపోలేదు.