తెలంగాణలో ఎదురులేని పార్టీగా అవతరించిన తెరాసకు ఈ మధ్య కాలంలో గడ్డుకాలం ఎదురైంది. తమకు పోటీగా నిలిచే నాయకులు తెలంగాణలో లేరని అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రజల్లో బలపడుతున్నారు. దుబ్బాక ఎన్నికల్లో మొదట మెజారిటీ కోసం ప్రయత్నాలు చేసిన తెరాస నాయకులు చివరికి గెలిస్తే చాలు అన్నట్టు వ్యవహరించారు. ఇలాంటి నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలు వస్తుండటంతో తెరాస నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మొన్న వరదల సమయంలో ప్రజలు తిట్టిన తిట్లను, తన్నిన దెబ్బలను ఇంకా మర్చిపోకముందే మళ్ళీ ప్రజల ముందుకు వెళ్లే పరిస్థితి రావడంతో తెరాస నేతలు ఇబ్బందులు పడుతున్నారు.
గ్రేటర్ ఎన్నికలను వాయిదా వేయమంటున్న తెరాస నేతలు
తెలంగాణలో తమకు అడ్డేలేదన్న తీరుగా తెరాస నేతలు వ్యవహరించే వారు. కానీ ఇప్పుడు తెరాస నేతలు ఎన్నికలంటేనే భయపడుతున్నారు. మొన్న వరదలు వచ్చినప్పుడు హైద్రాబాద్ వాసులు తెరాస నేతల యొక్క నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడంతో తెరాస నేతల్లో భయం మొదలైంది. ఇప్పటికే వరదల సమయంలో పరామర్శించడానికి వెళ్లిన తెరాస నేతలను ప్రజలు చెప్పుతో కొట్టినట్టు తిట్టి వెన్నక్కి పంపించేశారు. వెళ్లిన నేతలను ప్రజలు ప్రశ్నలు అడగడంతో సమాధానం చెప్పలేక తెరాస నేతలు చాలా ఇబ్బందులు పడ్డారు. తెరాసపై హైదరాబాద్ వాసుల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న తరుణంలో గ్రేటర్ ఎన్నికలు వచ్చాయి. ఇలాంటి సందర్భంలో ఎన్నికలకు వెళ్లడం సరికాదని భావించిన తెరాస నేతలు గ్రేటర్ ఎన్నికలు వాయిదా వేయాలని కేసీఆర్ ను విన్నవించుకుంటున్నారు. అయితే ప్రస్థుతానికి ఈ విషయం కోర్ట్ లో ఉంది.
కాంగ్రెస్-బీజేపీ నాయకులు తెరాసను దెబ్బతిస్తారా!!
తెలంగాణలో తనకు పోటీనే లేదనే తీరులో సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ నుండి, కాంగ్రెస్ నుండి తెరాస తీవ్ర పోటీని ఎదుర్కొంటుంది. ఈ విషయం దుబ్బాక ఎన్నికల్లో స్పష్టమైంది. తెరాస నేతలు ఇన్నాళ్లు తమకు కాంగ్రెస్ నేతలు మాత్రమే పోటీ అనుకున్నారు కానీ ఇప్పుడు బీజేపీ నేతలు కూడా తెరాసకు పోటీ నిలుస్తున్నారు. ప్రస్థుతానికి తెరాస నేతలు కాంగ్రెస్ కంటే కూడా బీజేపీ నాయకులకే, వాళ్ళ దూకుడుకే ఎక్కువ భయపడుతున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్-బీజేపీ నేతలు కేసీఆర్ కు ఎలాంటి షాక్ ఇస్తారో వేచి చూడాలి.