రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎప్పుడు వేడివేడిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ తెలంగాణలో మాత్రం ఏకచక్రాధిపతిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజకీయాలను ఏలుతున్నారు. ఆయన ఇక్కడ పోటీగా నిలబడే నాయకుడు లేడు, నిలబడి గెలిచే నాయకులు అంతకన్నా లేరు. 2014లో 60 సీట్లతో గెలిచిన టీఆర్‌ఎస్‌కు 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత వస్తుందని, సంక్షేమ పథకాల హామీల అమలులో కేసీఆర్ విఫలమయ్యాడని అన్నారు. కానీ 2014 కంటే ఎక్కువ సీట్లను తెచ్చుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత కూడా మిగతా పార్టీల్లోని నాయకులను చేర్చుకుంటూ ప్రతిపక్ష బెడద లేకుండా చేసింది. అయితే దుబ్బాక ఎన్నికల సమయంలో తెరాస లెక్కలు తారుమారు అయ్యాయి.
తెరాసకు మొదలైన కష్టాలు
ప్రతిపక్ష నాయకులను కూడా పార్టీలో చేర్చుకుంటూ పోటీ లేకుండా చెయ్యడానికి తెరాస నాయకులు ప్రయత్నాలు చేశారు. అయితే ఇప్పుడు బీజేపీ రూపంలో తెరాసకు కొత్త శత్రువు పుట్టుకు వచ్చారు. ఈ విషయం దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో తెరాస ప్రెసిడెంట్ కేటీఆర్ కు అర్ధమైంది. ఉప ఎన్నిక జరగుతుండడంతో అధికారంలో ఉన్న తమకు అక్కడ గెలుపు ఖాయమేనని, అయితే మెజారిటీ కోసం శ్రమించాలని భావించింది. కానీ రాను రాను గెలుపు కోసం కూడా తీవ్రంగా కృషి చేయాల్సి వస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నియమింపబడ్డ తరువాత బీజేపీ నాయకులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆ దూకుడుకు తెరాస నేతలు జడుసుకుంటున్నారు. ఇన్నాళ్లు తమకు రాష్ట్రంలో పోటీగా నిలిచేది కేవలం కాంగ్రెస్ నాయకులని తెరాస భావించింది కానీ ఇప్పుడు బీజేపీ రూపంలో కొత్త నేతలు తెరాసకు చుక్కలు చూపిస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికలు తెరాసకు పెద్ద సవాల్
గ్రేటర్ ఎన్నికల్లో తెరాస నాయకులు తమ సత్తాను చాటడానికి సిద్ధమయ్యారు కానీ భారీ వర్షాలు, వరదల కారణంగా పార్టీకి చెడ్డపేరు వచ్చింది. ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకొని ఉంటే చాలా మంది ప్రాణాలతో ఉండే వారని, సహాయక చర్యలు చెప్పడంలోను ప్రభుత్వం విఫలమైందని ప్రజలు భవిస్తున్నారు. అలాగే వరదల సమయంలో ప్రజా ప్రతినిధులు ప్రజలను పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు, వెళ్లిన కొంతమందిపై ప్రజలు దాడి చేశారు. ఇలా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. వరదల కారణంగా నష్టపోయిన వారికి రూ.10వేల చొప్పున అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాటి పంపిణీలో కూడా తప్పులు జరుగుతున్నాయని, మొత్తం డబ్బులు ఇవ్వడం లేదని ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాలు దక్కించుకున్న టీఆర్‌ఎస్‌కు ఈసారి ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో వేచి చూడాలి.