కేటీయార్ వాహనానికి ట్రాఫిక్ చలాన్: పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా.?

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకి చెందిన వాహనానికి ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించారు. ఆ చలాన్‌ మొత్తాన్ని కేటీయార్ చెల్లించేశారట. అంతే కాదు, చలాన్ విధించిన ట్రాఫిక్ పోలీసులను అభినందించారు, సన్మానించారు కూడా.

పోలీసులు తమ పని తాము చేశారు. అలాంటప్పుడు, వారిని సన్మానించడంలో ఉద్దేశ్యమేంటి.? అన్న చర్చ తెరపైకొస్తోంది. రోడ్డెక్కితే ట్రాఫిక్ ఉల్లంఘనలు వందల్లో, వేలల్లో కనిపిస్తాయి. అలా ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించేవారికి ట్రాఫిక్ పోలీస్ విభాగం చలాన్లు విధించడం మామూలే.

అయితే, రోడ్ల దుస్థితి మాటేమిటి.? కూడళ్ళ వద్ద సరిగ్గా పనిచేయని సిగ్నళ్ళ మాటేమిటి.? వీటన్నిటికన్నా ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న అధికారులు, ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ నాయకుల మాటేమిటి.? అన్న పశ్న ప్రజానీకం నుంచి వినిపిస్తుండడం కూడా సర్వసాధారణమైన విషయంగానే మారింది.

అందుకే, ట్రాఫిక్ నిబంధనల్ని ఎవరు ఉల్లంఘించినా జరీమానా తప్పదని చెప్పేందుకే కేటీయార్, తన కారుకి చలానా పడ్డ వైనాన్ని వెల్లడించారు. ట్రాఫిక్ పోలీసుల్ని అభినందించి, సన్మానించడం వెనుక ఉద్దేశ్యం సుస్పష్టం.. అడ్డగోలుగా చలానాలు వేసెయ్యరు, తప్పు చేస్తేనే చలానా.. అన్నది కేసీయార్ ఈ మొత్తం వ్యవహారం ద్వారా జనానికి చెప్పదలచుకున్న విషయం.

అయితే, కేటీయార్ పబ్లిసిటీ స్టంట్ చేశారన్న విమర్శ విపక్షాల నుంచి వినిపిస్తోంది. రోడ్ల నిర్వహణ జరిగా చేయని ప్రభుత్వానికి జరీమానా విధించాలి.. ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ నాయకులకు జరీమానా విధించాలన్నది విపక్షాల డిమాండ్. ఎవరి గోల వారిదే. అయినాగానీ, రోడ్ల నిర్వహణ.. ట్రాఫిక్ సమస్యలు.. వీటి విషయంలో ప్రభుత్వానికీ జరీమానా విధించాల్సిందేనేమో.