భారత్ లో కరోనా వైరస్ సమూహ వ్యాప్తికి సమయం ఆసన్నమైందా? దేశ వ్యాప్తంగా భారీగా పెరుగుతోన్న పాజిటివ్ కేసులు..మరణాల సంఖ్యను బట్టి పరిస్థితి అదుపు తప్పుతుందా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది. భారత్ లో అన్ లాక్ తర్వాత ఒక్కసారిగా కేసులు పెరిగిపోయాయి. వందల్లో నమోదైన కేసులు ఒక్కసారిగా వేలల్లో నమోదవ్వడం మొదలైంది. మరణాల సంఖ్య అదే స్థాయిలో నమోదవుతోంది. అయినా ప్రభుత్వాలు చేసేది ఏమీ లేదని చేతులెత్తేసాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లు అందరూ కరోనాతో కలిసి సహజీవనం చేయడం ప్రారంభించారు.
అయితే ఇప్పటివరకూ భారత్ లో సమూహ వ్యాప్తి అన్నది లేదు. కానీ చేజారుతోన్న పరిస్థితులుచూస్తుంటే? సమూహ వ్యాప్తికి చాలా దగ్గర్లోనే ఉన్నామని తెలుస్తోంది. అదీ తెలుగు రాష్ర్టాల్లో రోజు రోజుకి పరిస్థితులు అంతకంతకు మారిపోతున్నాయి. మొన్న విజయవాడ మార్కెట్ తమిళనాడులోని కోయం బేడ్ మార్కెట్ ని తలపించి బెంబేలెత్తిచింది. ఆ మార్కెట్ లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు ఉన్నా సిటీ మొత్తం చుట్టేయం ఖాయమని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో కొన్ని జిల్లాల కలెక్టర్లు లాక్ డౌన్ విధిస్తున్నాయి. శ్రీకాకుళం, తూర్పు గోదావరి సహా పలు జిల్లాల కలెక్టర్లు పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.
రోజూ వందల్లో కేసులు నమోదవ్వడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని….సమూహ వ్యాప్తి జరుగుతుందోమోనన్న అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్ కు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. గడిచిన మూడు, నాలుగు రోజుల్లో మరణాల సంఖ్య చూస్తే బెంబేలెత్తిపోవాల్సిన పరిస్థితే. అన్ని జిల్లాల్లో గణనీయంగా కేసుల సంఖ్యతో పాటు, మరణాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. ఇవన్నీ చూస్తుంటే పరిస్థితి చేయి దాటిపోతుందేమోన్న భయం వ్యక్తం చేస్తున్నారు కలెక్టర్లు. కేంద్ర ప్రభుత్వంగానీ, రాష్ర్ట ప్రభుత్వం గానీ ఎట్టి పరిస్థితుల్లో లాక్ డౌన్ పెట్టే ఆలోచన కూడా చేయకపోవడం మరింత భయాందోళనకు గురి చేస్తోందిని జిల్లా యాంత్రాంగం అసృంతృప్తిని వ్యక్తం చేస్తోంది. అలాగే కేరళలో సమూహ వ్యాప్తి లో కేసులు నమోదవుతున్నట్లు ఆ రాష్ర్ట సీఎం వెల్లడించారు.