సరిగ్గా ఆరేళ్ల క్రితం.. డిసెంబర్ 31. ప్రపంచమంతా కొత్త ఏడాదిని స్వాగతించేందుకు సంబరాలకు సిద్ధమవుతోంది. కానీ అదే క్షణాల్లో మానవ చరిత్ర దిశను మార్చేసే ఒక వార్త నిశ్శబ్దంగా బయటకు వచ్చింది. చైనాలోని ఓ నగరంలో గుర్తించిన ఒక రహస్య వ్యాధి.. కొద్ది నెలల్లోనే ప్రపంచాన్ని గడగడలాడించింది. అదే కోవిడ్-19. ఆధునిక యుగంలో మనిషి ఎప్పుడూ ఎదుర్కోని స్థాయిలో ఈ మహమ్మారి ప్రపంచాన్ని నిలిపేసింది.
మొదట సాధారణ న్యూమోనియాగా భావించిన ఈ వ్యాధి, క్రమంగా తీవ్రంగా పెరిగింది. చైనాలోని వూహాన్ నగరం ఆ మహమ్మారికి కేంద్రబిందువుగా మారింది. అక్కడి మార్కెట్ల నుంచి మొదలైన వైరస్, విమానాల వేగంతో ఖండాలను దాటి ప్రపంచ దేశాలకు విస్తరించింది. రోజులు గడిచే కొద్దీ ఆసుపత్రులు నిండిపోవడం, మృతుల సంఖ్య పెరగడం ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేశాయి.
2020 మార్చి నాటికి పరిస్థితి అదుపు తప్పింది. దేశాలు తమ సరిహద్దులను మూసేశాయి. నగరాలు ఖాళీగా మారాయి. వీధుల్లో నిశ్శబ్దం అలుముకుంది. ‘లాక్‌డౌన్’ అనే పదం ప్రతి మనిషి జీవితంలో భాగమైంది. ఆర్థిక కార్యకలాపాలు స్తంభించాయి. కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం కోవిడ్ కారణంగా 70 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
భారత్ కూడా ఈ మహమ్మారి ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయింది. 2020 మార్చిలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వలస కార్మికుల కష్టాలు దేశాన్ని కదిలించాయి. అయితే అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. ఆసుపత్రులు, ఆక్సిజన్ సరఫరా, పరీక్షల సామర్థ్యాన్ని క్రమంగా పెంచింది.
ఇకా కోవిడ్ రెండో దశలో డెల్టా వేరియంట్ భారత్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. కానీ ఈ సంక్షోభంలోనే భారత్ ప్రపంచానికి ఆశాకిరణంగా నిలిచింది. అతి తక్కువ సమయంలోనే దేశీయంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేసి, భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించింది. కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకాలు లక్షలాది ప్రాణాలను కాపాడాయి. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని భారత్ విజయవంతంగా నిర్వహించింది.
ఆరేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే, కోవిడ్ మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. ఆరోగ్య వ్యవస్థల ప్రాధాన్యం, శాస్త్రీయ పరిశోధన అవసరం, అత్యవసర పరిస్థితుల్లో సమిష్టి బాధ్యత ఎంత ముఖ్యమో ప్రపంచం తెలుసుకుంది. న్యూ ఇయర్ రోజున మొదలైన ఆ నిశ్శబ్ద హెచ్చరిక, మానవాళిని మరింత అప్రమత్తంగా జీవించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది.
