TDP : తెలుగుదేశం పార్టీకి అదే అతి పెద్ద సమస్య.. అదేంటో తెలుసా.?

TDP : ‘కుప్పం నియోజకవర్గంలో గెలిచి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బహుమతిగా ఆ గెలుపును అందిస్తాం..’ అంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మరి, ‘పులివెందులలో టీడీపీని గెలిపించి, చంద్రబాబుకి ఆ గెలుపుని బహుమతిగా ఇస్తాం..’ అని తెలుగుదేశం పార్టీలో ఎవరైనా చెప్పగలరా.? అధినేతకు భరోసా ఇవ్వగలరా.?

తెలుగుదేశం పార్టీ ఒకప్పటి పరిస్థితులకీ, ఇప్పటి పరిస్థితులకీ స్పష్టమైన తేడా. పార్టీని భుజాన మోసేంత సీన్ ఏ నియోజకవర్గంలో ఏ టీడీపీ నాయకుడికీ కనిపించడంలేదు. ‘పార్టీ లేదు.. బొక్కా లేదు..’ అంటూ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడే చేతులెత్తాక ఎవరైనా ఎందుకు సీరియస్‌గా రాజకీయాలు చేస్తారు టీడీపీలో.!

చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఊకదంపుడు ప్రసంగం. ఆ ప్రసంగానికి జనం చెవులు మూసుకోవాల్సి వస్తోంది. పార్టీ కార్యకర్తలు, నేతలు సైతం ఈ ‘సోది’ వినలేకపోతున్నారు. రెండున్నరేళ్ళలో టీడీపీ ఏమైనా బలం పుంజుకుందా.? లేదాయె. ‘మేం ప్రేమ లేఖలు రాస్తున్నాం, అట్నుంచి స్పందన రావడంలేదు..’ అంటూ జనసేన పార్టీ తమను కన్నెత్తి చూడకపోవడంపై దిగాలుపడే స్థాయికి టీడీపీ దిగజారిపోయింది.

వృద్ధాప్యం చంద్రబాబుని ఇబ్బంది పెడుతోంది. ఈ తరుణంలో తనయుడు లోకేష్ పార్టీని భుజానికెత్తుకోవాలి. అయితే, చంద్రబాబు ప్రసంగాలే కాస్త బెటర్.. బోర్ కొట్టేసినా, ఆయన మీద కార్యకర్తలకు కాస్తో కూస్తో గౌరవం వుంది. కానీ, నారా లోకేష్ అలా కాదు. ఆయన ఏం మాట్లాడినా, ఆ తర్వాత పార్టీకి ఎదురు దెబ్బ తగులుతోంది.

ఆ మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద అవాకులు చెవాకులు పేలి, నానా హంగామా చేసి, ఆ తర్వాత షరామామూలుగానే సైలెంటయిపోయారు. అడపా దడపా రెచ్చగొట్టే ప్రసంగాలు తప్ప లోకేష్, పార్టీని ఉద్ధరించింది లేదు. 2024 ఎన్నికల వరకూ కాదు, ఈలోగానే తెలుగుదేశం పార్టీ జెండా పీకేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నట్టుంది ఆ పార్టీ రాజకీయం.