తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన పర్యటించబోతోన్నారు. మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల దారుణ పరాజయాలు, వ్యక్తిగత సహాయకుడు మనోహర్ రాజీనామా, వైసీపీ బలంగా వేళ్లూనుకోవడం వంటి ప్రతికూల పరిస్థితుల మధ్య ఆయన తన సొంత నియోజకవర్గంలో పర్యటించబోతోన్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారు.
కుప్పం నియోజకవర్గం ఆవిర్భావం నుంచీ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వచ్చింది. ఇప్పటిదాకా మరో అభ్యర్థికి గెలిపించిన సందర్భాలు లేవు. 1989లో చంద్రబాబు నాయుడు తొలిసారిగా కుప్పంలోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచీ ఆయనదే హవా. ఇన్నేళ్ల కాలంలో టీడీపీకి గానీ, చంద్రబాబుకు గానీ ప్రతికూల వాతావరణం ఎప్పుడూ ఏర్పడలేదు. ఈ సారి మాత్రం వైఎస్ఆర్సీపీ కాస్త గట్టిగానే షాక్ ఇచ్చింది. కుప్పం నియోజకవర్గం పరిధిలో టీడీపీ బలంగా ఉన్న పంచాయతీల్లోనూ వైసీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు విజయం సాధించారు.
మొత్తం 89 పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించగా.. వైసీపీ ఏకంగా 74 చోట్ల పాగా వేయగలిగింది. దీన్ని చంద్రబాబు తేలిగ్గా తీసుకోవట్లేదు. తన కుప్పం పర్యటన సందర్భంగా చంద్రబాబు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. కుప్పానికి చెందిన స్థానిక నాయకులు, చిత్తూరు జిల్లా నేతలో ఆయన వరుస భేటీలను నిర్వహించనున్నారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ పులిపర్తి నాని, మాజీ ఎమ్మెల్యే జీ శంకర్ ఇతర నాయకులతో ఆయన చిత్తూరు జిల్లా రాజకీయాలు, పార్టీ స్థితిగతుల గురించి ఆరా తీయనున్నారు. సుదీర్ఘ కాలం అనంతరం తొలిసారిగా ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తుండటం తో దీనిపై ఆసక్తికర చర్చ సాగుతుంది.