ఎలాగూ అధికారం పోయింది, ప్రభుత్వ పరమైన పదవులు లేవు.. అందుకే కాబోలు తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీలోనే పదవులు సృష్టించుకుని వాటిని పంచుకుంటూ పండగ చేసుకుంటున్నారు. మళ్ళీ ఆ పంపకాల్లో కూడ విబేధాలు, అలకలు, ఆధిపత్య పోరులు. గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడానికి పార్టీ నడిచిన తీరే కారణమని బలంగా భావించిన చంద్రబాబు పార్టీ నాయకత్వంలో సమూల ప్రక్షాళన చేయాలని పార్లమెంటరీ ఆధ్యక్ష పదవులను సృష్టించారు. ఈ తరహా పదవులు గతంలో టీడీపీలో అలవాటు లేవు. కానీ వైసీపీ ఈ పద్దతిని ఫాలో అయి మంచి రిజల్ట్స్ తెచ్చుకుంది కాబట్టి కాపీ కొట్టేసి ఫాలో అయిపోయారు.
సరే ఆ కొట్టడమైన సక్రమంగా కొట్టారా అంటే అదీ లేదు. పార్లమెంటరీ అధ్యక్ష పదవుల్లో ఎక్కువగా పాత నేతలనే కూర్చోబెట్టారు. కొన్నిచోట్ల అయితే అసలు ఇన్నాళ్లు పార్టీలోనే ఉన్నారో లేదో కూడ తెలియని నాయకులకు బాధ్యతలు అప్పగించారు. కొన్ని చోట్ల మాత్రం మంచివారికే పగ్గాలిచ్చారు. మొత్తంగా మిశ్రమ స్పదనతో పదవుల పంపకం పూర్తయింది. ఇక ఈ పదవులు దక్కించుకోలేకపోయిన చాలామంది లీడర్లు తమకు కూడ ఏదో ఒక గుర్తింపు కావాలని పట్టుబడుతున్నారట. లేకుంటే పార్టీకి గుడ్ బై చెప్పేస్తామని హెచ్చరిస్తున్నారట.
ఎలాగూ పార్టీ పొలిట్ బ్యూరో పదవుకు ఉండనే ఉన్నాయి. వీటిలో సీనియర్లకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఛాన్నాళ్ళుగా పార్టీ కోసం పనిచేసిన వారికి, సొంత క్యాడర్ కలిగిన వారికి ఈ సభ్యత్వాలు దక్కుతాయి. అలాగే తెలుగు యువత కమిటీలను టీడీపీ మాత్రమే ఏర్పాటు చేస్తుంటుంది. ఈ కమిటీల్లో యువ నాయకులకు పెద్ద పీఠ వేస్తారు. ఈసారి కూడా అన్ని జిల్లాలను వడపోసి బాగా పనిచేస్తున్న 20 నుండి 25 మంది యువ లీడర్లను ఎంపికచేసి కమిటీలను అప్పగించనున్నారు బాబుగారు. ఇన్ని చేసినా కొందరు నాయకులు ఎటూ కాకుండా మిగిలిపోతున్నారు.
వారంతా పదవులు లేకుండా పార్టీలో ఉండటం ఎలా అంటూ ఫీలై జిల్లా కమిటీలను తెరమీదకు తెచ్చి వాటిని ఏర్పాటుచేసి ఆ పదవులు తమకివ్వమని చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తున్నారట. ఇప్పటికే పార్లమెంట్ అధ్యక్ష పదవులు, తెలుగు యువత కమిటీలు, పొలిటి బ్యూరో సభ్యత్వాలతో కిందా మీదా పడుతున్న బాబుగారికి ఈ జిల్లా కమిటీలు కొత్త తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ప్రతి జిల్లాకు కమిటీవేసి గోల చేస్తున్న నేతలకు అప్పగిద్దామని అనుకున్నా అప్పటికీ ఇంకొందరు మిగిలిపోతారు. ఆ తర్వాత వారు కూడా ఏదో ఒక కమిటీ వేసి పదవులు సృష్టించి పంచమని అడిగినా అడుగుతారు. మొత్తానికి.. టీడీపీ నేతలు తమకి తామే పదవులు సృష్టించుకుని పంచేసుకుని ఆనందపడిపోతున్నారు.