Janasena : జనసేనకు మేలు చేస్తోన్న టీడీపీ, వైసీపీ.?

Janasena : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్న మొన్నటి వరకు ఓ ఈక్వేషన్.. ఇప్పుడు ఇంకో ఈక్వేషన్.. అన్నట్టు నడుస్తోంది రాజకీయం. జనసేన పార్టీని ప్రధాన రాజకీయ పార్టీగా అధికార వైసీపీ గుర్తించడంలేదు. తెలుగుదేశం పార్టీ కూడా, తమ అవసరానికి జనసేన పనికొస్తుందన్న భావనలోనే వుంది. బీజేపీ మాత్రం, జనసేన పార్టీని ముందు పెట్టి రాజకీయం చేయాలనుకుంటోంది.

అయితే, స్థానిక ఎన్నికల వేళ చాలా కొన్ని చోట్ల టీడీపీకే కాదు, వైసీపీకి కూడా జనసేన షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి క్రమంగా ‘ఊపు’ పెరుగుతోంది. ఈ విషయాన్ని అధికార పార్టీ కాస్త ఆలస్యంగా గుర్తించింది. తెలుగుదేశం పార్టీ అయితే పరిస్థితి అంచనా వేసేలోపే పూర్తిగా దెబ్బతినేసింది.

ఉత్తరాంధ్రలో కూడా జనసేన పార్టీకి క్రమంగా మైలేజ్ పెరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత పూర్తిగా జనసేన ఖాతాలోకి వెళుతోంది. ఆ కారణంగానే జనసేన పార్టీ కింది స్థాయిలో క్రమంగా బలపడుతోందని స్థానికంగా ఎక్కడికక్కడ చర్చ జరుగుతోంది. అదే నిజమైతే, అధికార పార్టీకే కాదు, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకీ ముందు ముందు కష్టకాలం తప్పకపోవచ్చు.

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ‘కింగ్ మేకర్’ అవతారమెత్తుదామనుకున్నా, బొక్క బోర్లా పడిన విషయం విదితమే. కానీ, 2024 ఎన్నికల నాటికి మాత్రం జనసేన పార్టీ ఖచ్చితంగా కింగ్ మేకర్ అవుతుందనే అంచనాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అయితే, జనసేన పార్టీ అప్పుడు ఎవరితో కలిసి వెళుతుందన్న చర్చ ఇప్పటినుంచే జరుగుతోంది.

‘అబ్బే, జనసేనకు అంత సీన్ లేదు..’ అని విమర్శిస్తున్న నేతల్లో కొందరు, ఇప్పటికే జనసేనతో టచ్‌లోకి వెళ్ళారనీ, ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి చెందినవారే ఈ లిస్టులో వున్నారనీ తెలుస్తోంది. ఆయా పార్టీలో సీట్లు దక్కడం కష్టమనుకున్నవారు, తమ తమ నియోజకవర్గాల్లో గెలవడానికి శ్రమించాల్సి వస్తుందనే ఆందోళలనలో వున్నోళ్ళు. జనసేన పార్టీ వైపు చూస్తున్నారట.