షర్మిలపై టీఆర్ఎస్ దిగజారుడు వ్యాఖ్యలు.. గేమ్ మొదలు.!

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పుడెలా మారిపోతాయో చెప్పలేం. తెలంగాణ మంత్రి ఒకరు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై షర్మిల తీవ్రంగా స్పందించారు. దాంతో, ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అసలు సోదిలో లేదనుకున్న వైఎస్సార్టీపీ ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది ఈ వ్యవహారంతో.

షర్మిల ప్రతి మంగళవారం చేస్తున్న దీక్షల్ని ఉద్దేశించి, ‘మంగళవారం మరదలు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ మంత్రికి, షర్మిల ఘాటుగా సమాధానమిచ్చారు. పేరు ప్రస్తావించకుండానే, ‘చందమామని చూసి కుక్కలు మొరుగుతాయ్..’ అని అనేశారు. అంతే కాదు, ‘కుక్కలు’ అనే ప్రస్తావన పదే పదే చేశారామె.

ఓ మహిళ విషయంలో ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు ఎవరు చేసినా అది సమర్థనీయం కాదు. కానీ, నేటి రాజకీయాలు ఎలా తగలడ్డాయ్.? ముఖ్యమంత్రి కేసీయార్, మంత్రి కేటీయార్ మీద షర్మిల కూడా వివాదాస్పద వ్యాఖ్యలే చేస్తున్నారు.. వాటిపై రియాక్షన్ కూడా గులాబీ పార్టీ నుంచి గట్టిగానే వస్తోంది.

అయితే, షర్మిల ఖచ్చితంగా ‘మహిళా కార్డు’ ప్లే చేస్తారు. అదే ఆమెకు పెద్ద అస్త్రం కూడా. మహిళలెవరూ షర్మిలపై తెలంగాణ మంత్రి వ్యాఖ్యల్ని సమర్థించరు. అదే సమయంలో, షర్మిల.. గులాబీ పార్టీ మీద చేస్తున్న వ్యాఖ్యలకు మద్దతు పెరుగుతోంది.

వైఎస్ షర్మిల పాదయాత్ర మొదలైనప్పటినుంచీ క్రమక్రమంగా వైఎస్సార్టీపీ పేరు వార్తల్లో కనిపించడం ఎక్కువైంది. గులాబీ పార్టీ కూడా అంతర్గతంగా పరిస్థితులపై ఆరా తీస్తోంది. షర్మిల పార్టీకి ఎవరైనా ఆకర్షితులవుతున్నారా.? అంటూ నిఘా పెట్టారు గులాబీ నేతలు. ఈ సమయంలో మంత్రిగారి ‘మంగళవారం మరదలు’ కామెంట్స్.. గులాబీ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా చేశాయ్.