RGV : ఆర్జీవీ మాస్టర్ ప్లాన్: ఏం జరుగుతుంది చెప్మా.?

RGV :  సినిమాలు మాత్రమే కాదు, థీమ్ పార్కులు, మ్యూజిక్ కాన్సెర్టులు, మ్యాజిక్ షోలు వంటివి కూడా వినోదం కిందకే వస్తాయి.. వాటి ధరల్ని కూడా ప్రభుత్వాలు నిర్ణయించడంలేదంటూ వివాదాల ఫిలిం మేకర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా ట్వీటేయడం సినీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రామ్ గోపాల్ వర్మ వాదనల్లో కొన్ని సబబుగానే వుంటాయి. అలాగని, సమాజం పట్ల వీసమెత్తు బాధ్యత కూడా వర్మలో వుండదు. లీగల్ పాయింట్లను వర్మ బాగా వంటబట్టించుకుంటాడు, కానీ చేసేవన్నీ చెత్త పనులేనన్న వాదనా లేకపోలేదు.

సరే, ఇప్పుడు సినిమాల విషయమై వర్మ, ఏపీ సర్కారుతో పంచాయితీ చేయడం గురించి మాట్లాడుకుందాం. వర్మకి ఏపీ మంత్రి పేర్ని నాని నుంచి పిలుపు వచ్చింది. పేర్ని నానితో మాట్లాడి తన అనుమానాల్ని నివృత్తి చేసుకుంటాననీ, అలాగే ప్రస్తుత వివాదానికి పరిష్కారం దొరికే అవకాశం వుందనీ ఆశాభావం వ్యక్తం చేశాడు వర్మ.

వర్మ చెప్పాడని వైఎస్ జగన్ సర్కారు తన పాలసీలను మార్చుకోదు కదా.? సినీ పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు పలు అభ్యంతరాలు లేవనెత్తినప్పటికీ వైఎస్ జగన్ సర్కారు దిగిరావడంలేదు. ఆర్జీవీ, మంత్రితో భేటీ అయితే సీన్ మారిపోతుందా.? మారదని ఆర్జీవీకి కూడా తెలుసు.

అందుకే, సోషల్ మీడియా వేదికగా ఆర్జీవీ చెయ్యాల్సిన యాగీ అంతా చేస్తూనే వున్నారు. ఈ యాగీ ద్వారా ఆర్జీవీకి జస్ట్ పబ్లిసిటీ వస్తుందంతే. సినీ పరిశ్రమకి ఒరిగేదేమీ వుండదు.