రేవంత్ వర్సెస్ కేటీయార్: ఎవరిది పై చేయి.?

Revanth Vs KTR : రాజకీయాల్లో విమర్శలు సహజాతి సహజం. అయితే, ఆ విమర్శలు ఎప్పుడో గతి తప్పాయ్.! బూతుల దాకా వెళ్ళింది వ్యవహారం. సరే, ఆ సంగతి పక్కన పెడితే, తెలంగాణ రాజకీయాల్లో గట్టిగా మాట్లాడే ఇద్దరు నాయకుల్లో ఒకరు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ కాగా, మరొకరు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంగతేంటి.?

బండి సంజయ్ వ్యవహారాన్ని పక్కన పెడితే, ప్రస్తుతం సీన్‌లో రేవంత్ రెడ్డి, కేటీయార్ ప్రముఖంగా కనిపిస్తున్నారు. తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ పర్యటించి, సందడి చేశాక.. రేవంత్ వర్సెస్ కేటీయార్‌గా మారిపోయింది వ్యవహారం. కాదు కాదు, కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టు మారింది పరిస్థితి.

కేటీయార్, రేవంత్ రెడ్డి మధ్య మాటల పంచాయితీ గట్టిగా నడుస్తోంది. ‘ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ’ అంటూ రేవంత్ రెడ్డి మీద కేటీయార్ విమర్శలు చేస్తున్నారు. కేటీయార్ మీద రేవంత్ రెడ్డి విమర్శలూ ఘాటుగానే వుంటున్నాయి.

ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, సోషల్ మీడియా ఫాలోవర్స్ విషయంలో కేటీయార్, రేవంత్.. ఇద్దరూ ఇద్దరే. దాంతో, ఇద్దరి అభిమానుల మధ్యా సోషల్ మీడియాలో మాటల యుద్ధం కొనసాగుతోంది. వీడియోలు షేర్ చేస్తూ, మీమ్స్ పోస్ట్ చేస్తూ రేవంత్, కేటీయార్ అభిమానులు పరస్పరం మాటల దాడులు చేసుకుంటున్నారు.

ఇంతకీ, ఈ యుద్ధంలో ఎవరిది పై చేయి.? అంటే, ముమ్మాటికీ కేటీయార్‌దేనని చెప్పక తప్పదు. అందుకే, కేటీయార్ – కవిత మధ్య పదవుల పంచాయితీ.. అంటూ రేవంత్ కొత్త వివాదానికి తెరపైకి తెస్తున్నారు. అది కొంత వర్కవుట్ అవుతోంది కూడా.

రాజకీయాలంటేనే అంత.! ఈ వివాదం ముదిరి ఇంకెంత పాకాన పడుతుందోగానీ, రేవంత్ సైన్యం.. కేటీయార్ సైన్యం.. తగ్గేదే లే అంటున్నారు.