వన దేవతల ఆశీస్సులు పొందాలనే కోరిక ఉన్నా, మేడారం వెళ్లలేని భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం వినూత్న ఏర్పాట్లు చేసింది. ఈ సారి ఘనంగా జరగనున్న సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా, భక్తులు ప్రత్యక్షంగా అమ్మవార్లను దర్శించుకోలేకపోయినా, వారి ప్రసాదం మాత్రం నేరుగా ఇంటి ముంగిటకు చేరేలా ప్రత్యేక సేవలను ప్రారంభించింది. దేవాదాయ శాఖ, తెలంగాణ ఆర్టీసీ కలిసి ఈ ప్రత్యేక ప్రసాద పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.
ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరను ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పిలుస్తారు. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర వన ప్రాంతానికి చేరుకుంటారు. అయితే అనారోగ్యం, ఉద్యోగ బాధ్యతలు, వయోభారం వంటి కారణాలతో ఎంతో మంది ఈ మహాజాతరకు హాజరుకాలేకపోతుంటారు. అయినా అమ్మవారి ప్రసాదమైనా దొరికితే చాలని కోరుకునే భక్తులకు ఇది నిజంగా శుభవార్తగా మారింది.
ఈ నెల 28 నుంచి 31 వరకు వైభవంగా జరగనున్న జాతర కోసం ఇప్పటికే ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు రూ.200 కోట్లకు పైగా నిధులు కేటాయించి, మౌలిక వసతులు, భద్రత, భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గత జాతరల కంటే ఈసారి సేవలను మరింత మెరుగుపరిచామని మంత్రి సీతక్క వెల్లడించారు. అందులో భాగంగానే ఇంటికే అమ్మవారి ప్రసాదం చేరే విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రత్యేక ప్రసాదాన్ని పొందాలంటే భక్తులు టీజీ ఆర్టీసీ లాజిస్టిక్స్ వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. అలాగే సమీపంలోని ఆర్టీసీ కార్గో సర్వీస్ సెంటర్‌కు వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకుని బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఒక్కో ప్రసాద ప్యాకెట్‌కు రూ.299 సర్వీస్ ఫీజు నిర్ణయించారు. ఈ ప్యాకెట్‌లో అమ్మవార్ల ఫొటో, కుంకుమ, పసుపు, బెల్లం వంటి ప్రసాద వస్తువులు ఉంటాయి.
ప్రసాదం పవిత్రతపై భక్తుల్లో ఎలాంటి సందేహాలు లేకుండా ఉండేందుకు దేవాదాయ శాఖ, ఆర్టీసీ స్పష్టత ఇచ్చాయి. మేడారం అమ్మవారి సన్నిధిలో భక్తితో సిద్ధం చేసిన ప్రసాదాన్నే భక్తుల ఇళ్లకు పంపిస్తామని, శుభ్రత, నమ్మకాన్ని పూర్తిగా పాటిస్తామని అధికారులు భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత మూడు నెలలుగా మంత్రులు, ఉన్నతాధికారులు అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈసారి 2 నుంచి 4 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తుండటంతో, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టారు. మేడారం రాలేని భక్తులకూ అమ్మవారి అనుగ్రహం అందాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ ప్రసాద సేవ ఇప్పుడు విశేష స్పందన పొందుతోంది.
