ఏపీలో అధికార పార్టీ వైకాపా రంగుల వ్యవహారం గురించి తెలిసిందే. ప్రభుత్వ కార్యాలయాలకు జెండా రంగులు వేయడంపై విమర్శలు మోసిన ప్రభుత్వం చివరికి కోర్టు తీర్పుతో రంగులు తొలగించాల్సి వచ్చింది. ఈ విషయంలో హైకోర్టు రంగులు తొలగించండని ముందే చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. సుప్రీంకోర్టుకి హైకోర్టు తీర్పును సవాల్ చేసి వెళ్లింది. చివరికి అక్కడా భంగపాటు తప్పలేదు. అత్యున్నత న్యాయ స్థానం తీర్పుతో రంగులు తొలగించక తప్పలేదు. చివరికి పార్టీ జెండా రంగును తొలగించి మొత్తమంతా ఒకే తెల్లరంగు వేసారు. మరి తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలాగే మహిళల బయోటాయిలెట్లకు గులాబీ రంగు వేసిన సంగతి తెలిసిందే.
ఈ గులాబీ రంగు ఐడియా మంత్రి కేటీఆర్ ది. ఆయన ఆదేశాల మేరకే మరో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బయో టాయిలెట్ బస్సులన్నింటకీ గులాబీ రంగులేసే పనుల్లో బీజీ అయ్యారు. అయితే ఇప్పుడా రంగులన్నింటిని తక్షణం తొలగించమని సీఎం కేసీఆర్ మళ్లీ అదేశాలు జారీ చేసారు. దీనిలో భాగంగా పువ్వాడికి సూచనలు, సలహాలు ఇచ్చారు. మహిళలకు ఇబ్బందికరంగా ఉంటుందనే ఆ రంగులు తొలగించాలని ఆదేశిలిచ్చినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా ఆరంగులన్ని తొలగించాలని ఆదేశాలిచ్చారు. దీంతో ఇప్పుడు యంత్రాంగం గులాబీ రంగును తొలగించే పనిలో బిజీ అయింది.
మరి కేసీఆర్ వేసిన రంగులు తొలగించడం వెనుక? అసలు కారణం మహిళల ఇబ్బందిని గుర్తించేనా? లేక ప్రతిపక్షం హైకోర్టులో పిల్ వేస్తే లేనిపోని పంచాయతీ అని ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే జగన్ సర్కార్ రంగుల విషయంలో సుప్రీంకోర్టులో కూడా పోరాటం చేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇక టీఆర్ఎస్ సర్కార్ కూడా ఇప్పటికే హైకోర్టులో పలు కేసుల విషయంలో మొట్టి కాయలు వేయించుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా విషయంలో కోర్టు నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.