తెలంగాణలో, గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా వైరస్ మళ్లీ కోరలు చాచి విరుచుకుపడుతోంది. మహమ్మారి తగ్గిపోతుందను కుంటోన్న సమయంలో అనూహ్యంగా మళ్లీ విజృంభించడం మొదలైంది. ఈ నేపథ్యంలో కరోనాని తరిమేస్తామని ప్రామిస్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలు, కమ్యునిస్ట్ పార్టీలు కరోనాని అదుపుచేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి అలియాస్ రాములమ్మ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మే 8వ తేదీ తర్వాత తెలంగాణలో కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోతాయని టీఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన ప్రకటనలు చూసి హైదరాబాద్ వాసులు చాలా ఆశలు పెట్టుకున్నారని, కానీ ప్రభుత్వం ప్రకటించిన తేదీ తర్వాత కూడా కేసులు తగ్గకపోవడం ఏంటని? రాములమ్మ ప్రశ్నించారు. మళ్లీ నగర వాసులకు వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుందన్నారు. టీఆర్ ఎస్ హైదరాబాద్ ని రెడ్ జోన్ గా ప్రకటించింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే వెసులు బాటు కూడా లేదు. మరి అలాంటప్పుడు కోవిడ్-19 ఎందుకు పంజా విసురుతున్నట్లు? కేసుల సంఖ్య ఏకారణంతో పెరుగుతుందో అర్ధం కాలేదంటూ ప్రభుత్వ పనితీరును ప్రశ్నించారు.
విదేశాల నుంచి వచ్చిన వారి క్వారంటైన్ పూర్తయిందన్నారు. మరి తబ్లీక్ జమాత్ కు వెళ్లిన వారందర్నీ ప్రభుత్వం గుర్తించిందా? వాళ్లందరీ క్వారంటైన్ పూర్తయిందా? వీటన్నింటిపై కేసీఆర్ క్లారిటీగా మాట్లాడుగలరా? అని ప్రశ్నించారు. వలస కూలీల వల్ల వ్యాప్తి చెందుతుందని కొత్త వాదనని ప్రభుత్వం తెరమీదకు తీసుకొచ్చిందని విమర్శించారు. అదే నిజమైతే హైదరాబాద్ ని రెడ్ జోన్ గా ప్రకటించడంలో అర్ధమేముంది? అంటే వలస కూలీలు హైదరాబాద్ లో విచల విడిగా తిరిగే అవకాశం ఉదా? ఈ విషయాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేసారు. ఒకవేళ వలస కూలీల వల్ల వ్యాప్తి చెందకపోతే నాలుగు రోజులుగా హైదరాబాద్లో కేసులు ఎందుకు పెరుగుతున్నాయో స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసారు. కరోనా కట్టడి విషయంలో టీఆర్ ఎస్ మొదటి నుంచి నిజాలు దాస్తోందని ఆరోపించారు.