తెలంగాణ భవన్ వేదికగా జరిగిన బీఆర్‌ఎస్ నేతల సమావేశం రాజకీయంగా కాకరేపింది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సింగరేణి నైని బ్లాక్ టెండర్ల రద్దును కేంద్రంగా చేసుకుని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకున్న ఆయన, ఈ వ్యవహారంలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.
నైని బ్లాక్ టెండర్లను రద్దు చేయడానికి కారణంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రస్తావించిన “కాంట్రాక్టు సైట్ విజిట్ సర్టిఫికెట్” అనే విధానం పూర్తిగా కల్పితమని హరీష్‌రావు కొట్టిపారేశారు. గతంలో రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కానీ ఇలాంటి నిబంధన ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమేనని, దీని వల్ల మొదట లాభం పొందింది సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి సంస్థేనని ఆరోపించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ అమల్లోకి వచ్చిన వెంటనే సృజన్‌రెడ్డి కంపెనీకి చెందిన షోదా కన్‌స్ట్రక్షన్‌కు తొలి టెండర్ దక్కిందని ఆయన తెలిపారు.
ఈ నిబంధనతో టెండర్ల ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో జరగకుండా, కాంట్రాక్టర్లు వ్యక్తిగతంగా సైట్‌కు వెళ్లి సర్టిఫికెట్ తీసుకునే పరిస్థితి ఏర్పడిందని హరీష్‌రావు విమర్శించారు. దీని ద్వారా ఎవరు టెండర్లు వేస్తున్నారన్న సమాచారం ముందుగానే సీఎం వద్దకు చేరుతోందని, ఆ తర్వాత కాంట్రాక్టర్లపై ఒత్తిళ్లు తెచ్చి టెండర్లు ఉపసంహరించుకునేలా లేదా ప్రభుత్వానికి అనుకూలంగా మార్చేలా చేస్తున్నారని ఆరోపించారు.
నైని బ్లాక్ టెండర్ల రద్దు వెనుక బీజేపీ–కాంగ్రెస్ మధ్య అవగాహన ఉందా అనే అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. అలాంటి సంబంధం లేదని నిరూపించుకోవాలంటే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. విచారణ జరిగితే తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ సమర్పిస్తానని హరీష్‌రావు స్పష్టం చేశారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ లేదన్న కారణంతో నైని బ్లాక్ టెండర్లను రద్దు చేసిన ప్రభుత్వం, అదే విధానంలో ఇప్పటివరకు ఇచ్చిన అన్ని టెండర్లను కూడా రద్దు చేయాలని ఆయన సవాల్ విసిరారు. అంతేకాదు, ఈ విధానాన్ని సింగరేణిలో శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయని కూడా హరీష్‌రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నైని బ్లాక్ టెండర్ల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి మధ్య వర్గపోరు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇది క్యాబినెట్ కాదు, దండుపాళ్యం ముఠాలా మారిందని విమర్శించారు. ఈ వాటాల గొడవలో ఐఏఎస్ అధికారులు, జర్నలిస్టులు బలి అవుతున్నారని ఆరోపిస్తూ, నైని స్కాం వెనుక అసలు ఎవరు ఉన్నారో భట్టి విక్రమార్క ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా గమనిస్తున్నారని హరీష్‌రావు హెచ్చరించారు.
