ఆంధ్రప్రదేశ్ లో పేదలందరికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా జులై 8న ఇళ్ల పట్టాల పంపీణీ కార్యక్రమానికి ప్రభుత్వం ముహూర్తం పెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి బడుగు బలహీన వర్గాలందరి జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఈ కార్యక్రమానాకి నాంది పలికారు. దాదాపు 30 లక్షల మంది పేదల్ని గుర్తించి అందరీకి ప్రభుత్వం తరుపున అందించాలని సంకల్పించి ఏడాదిగా పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడా పట్టాల పంపీణీ కార్యక్రమం వాయిదా పడినట్లు సమాచారం. ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువ అవ్వడం..వైరస్ ఉదృతి కూడా ఎక్కువగా ఉండటంతో సీఎం జగన్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలిసింది.
ఆగస్ట్ 15 కల్లా రాష్ర్టంలో పరిస్థితులు బాగుంటే ఆ రోజు పట్టాల పంపీణీ కార్యక్రమం చేపట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో పేదలకు మళ్లీ షాక్ తప్పలేదు. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని ఏడాది పాలన పూర్తి చేయకుండానే ముగించాలని జగన్ నిర్ణయించారు. ముందుగా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా పంపిణీ చేయాలనుకున్నారు. ఆ తేదీ వాయిదా పడిన తర్వాత అంబేద్కర్ జయంతి సందర్భంగా మరో తేదీని నిర్ణయించారు. కానీ రెండు తేదీల్లో అనివార్య కారణాల వల్ల పంపిణీ చేయడం సాధ్యంపడలేదు. ఆ తర్వాత రాష్ర్టంలోకి కరోనా రావడంతో పరిస్థితులే తల్లకిందులైపోయాయి.
ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం..పూర్తిగా వైరస్ పై పోరాటం చేసే పనిలో బిజీగా ఉండటంతో పట్టాల పంపీణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. దీంతో పేదలకు మళ్లీ ఎదురు చూపులు తప్పలేదు. ప్రస్తుతం రాష్ర్టంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో కొన్ని జిల్లాల కలెక్టర్లు ఆ జిల్లాల ఫరిదిలో లాక్ డౌన్ విధిస్తున్నారు. తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాలు ఇప్పటికే లాక్ డౌన్ లో ఉన్నాయి. కేవలం కొన్ని గంటలు మాత్రమే నిత్యావసర సరుకుల కొనుగోళ్లను అనుమతినిచ్చారు. ఇంకొన్ని గ్రామాలు, చిన్న చిన్న టౌన్లు స్వచ్ఛందంగానే లాక్ డౌన్ పెట్టుకుంటున్నాయి.