Polavaram Project : పోలవరం ప్రాజెక్టు: కేంద్రంతో ఏపీకి అంతా ‘సవ్యమే’నా.?

Polavaram Project

Polavaram Project : పోలవరం ప్రాజెక్టుని సందర్శించారు కేంద్ర మంత్రి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కూడా హాజరయ్యారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుండడమే విచిత్రం. పోలవరం ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగా సొంత నిధులతో ఖర్చు చేస్తే, కేంద్రం ఆ నిధుల్ని రీ-ఎంబర్స్ చేస్తుంది. ఇదెక్కడి వింత.? అంటే, అదంతే. చంద్రబాబు హయాం నుంచే జరుగుతోంది ఈ వింత.

ప్రాజెక్టు (Polavaram Project)  నిర్మాణం అయితే జరుగుతోంది. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో తలపెట్టిన ప్రాజెక్టు ఇది. ఇంత దారుణం బహుశా ఇంకే ప్రాజెక్టు విషయంలోనూ జరిగి వుండదేమో. ఇంత నిర్లక్ష్యమా.? అంటే, అదంతే.. ఆంధ్రప్రదేశ్ అంటే లోకువంతే. 2018 చివరి నాటికి పూర్తవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టు, 2022 మార్చి నాటికి కూడా పూర్తి కాలేదు.

2024 నాటికి అయినా ప్రాజెక్టు పూర్తవుతుందా.? అంటే, అది సందేహమే. సరే, కేంద్ర మంత్రి వచ్చారు.. ముఖ్యమంత్రితో కలిసి చిరునవ్వులు చిందించారు. గిరిజనుల సంప్రదాయ వేషధారణలో ఇద్దరూ హంగామా చేశారు. ఆల్ ఈజ్ వెల్.. అంటున్నారు.

కేంద్రం, పోలవరం ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధితో వుందని కేంద్ర మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి, కేంద్రం పూర్తిస్థాయిలో పోలవరం ప్రాజెక్టుకి సాయం చేయాలని కోరారు. అంతా బాగానే వుంది. జరగాల్సిన సాయం జరుగుతుందా. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని పూర్తిచేయాల్సిన సమయంలో పూర్తి చేస్తుందా.? అదొక్కటీ మిలియన్ డాలర్ల ప్రశ్న.

పోలవరం ప్రాజెక్టు చుట్టూ ‘క్రెడిట్’ పోరాటం జరుగుతోంది. ఆ ఘనత ఎవరికి దక్కాలన్న విషయంలో రచ్చ జరుగుతోంది. అదే ఈ ప్రాజెక్టుకి శాపంగా మారింది.