Omicron Pandemic : ఒమిక్రాన్ పాండమిక్: ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం.. ప్రజలకు శాపం.!

Omicron Pandemic : కొత్త సంవత్సరంలో ఒమిక్రాన్ వేరియంట్ జనాన్ని వణికించేస్తోంది. దేశంలో 6 వేల దిగువకు వచ్చిన కోవిడ్ కేసులు కాస్తా, ఒమిక్రాన్ దెబ్బకి మళ్ళీ 30 వేలకు చేరువైపోయాయి. ఈ పెరుగుదల ఇంకా వేగంగా వుండబోతోందంటూ అంచనా వేస్తున్నారు. ‘రోజుకి లక్ష కేసులు వచ్చినా ఇబ్బంది లేదు..’ అంటూ ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందంటే, అంచనాలు ఎంత భయానకంగా వున్నాయో అర్థం చేసుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ పెరుగుదల చాలా స్వల్పంగానే వుంది ప్రస్తుతానికి. అయితే, తెలుగు రాష్ట్రాల్లో జనం సంబరాలు చేసుకుంటున్న తీరు, ప్రభుత్వాలు చేస్తున్న పబ్లిసిటీ స్టంట్లు.. వెరసి, ముందు ముందు పరిస్థితి అత్యంత దారుణంగా వుండబోతోందన్నది నిర్వివాదాంశం.

హైద్రాబాద్ నగరంలో షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతున్నాయి. తాజాగా నుమాయిష్.. అదేనండీ ఎగ్జిబిషన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే కోడి పందాల హంగామా మొదలవుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా వున్నామని ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనల్లో డొల్లతనం అందరికీ అర్థమవుతోంది.

నిజానికి, జనంలో భయం లేనప్పుడు, ప్రభుత్వాలు ఎంత బాధ్యతగా వ్యవహరించినా ఉపయోగంల లేదు. యధా ప్రజ.. తధా రాజ.. అని తిరగేసుకుని చదువుకోవాలేమో.. ప్రస్తుత పరిస్థితుల్ని. తీరా, కేసులు పెరిగాక.. లాక్ డౌన్.. అంటూ ప్రభుత్వం ప్రకటిస్తే, జనం ఉస్సూరుమనాల్సిందే.

కానీ, ఎవరూ తగ్గట్లేదు. రాజకీయ పార్టీల రాజకీయ కార్యక్రమాలు నడుస్తున్నాయి.. ప్రభుత్వాలు పబ్లిసిటీ స్టంట్లు చేస్తూ జనాన్ని పలు కార్యక్రమాల కోసం సమీకరిస్తున్నాయి.. జనం పండగల్లో మునిగి తేలుతున్నారు. మొదటి వేవ్‌ని చూసి ఏమీ నేర్చుకోలేదు.. రెండో వేవ్ కూడా ఏమీ నేర్పలేకపోయింది.. పోతే, ప్రాణాలే కదా.. అన్న నిర్లక్ష్యం ప్రజల్లో వుందా.? ప్రభుత్వాల అలసత్వమెంత.? ఏమోగానీ, మూడో వేవ్.. ఎంతమందిని తనతో తీసుకుపోతుందో తలచుకుంటేనే భయమేస్తోంది.!