భారత్‌లోకి BF-7 కరోనా కొత్త వేరియంట్ ఎంట్రీ… ఎయిర్‌పోర్టులలో హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం!

Coronavirus.. Black Fungus.. Triple Attack

కరోనా వైరస్ తగ్గుముఖం పట్టి ప్రజలు ప్రశాంతంగా జీవిస్తూ ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటున్న తరుణంలో కరోనా మహమ్మారి ఒమిక్రాన్ BF-7 వేరియంట్ కొత్త రూపంలో చైనాలో విలయతాండవం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ పరిస్థితి చేయి దాటడంతో ప్రజలు ప్రాణాలకు రక్షణ కరువైంది.చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇది మరింత తీవ్రం కానుందని రాబోయే రోజులు కీలకమని అంతర్జాతీయ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి వైరస్‌ కొత్త వేరియెంట్ల ముప్పు పొంచి ఉండడంతో భారత ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.

ఈ నేపథ్యంలో కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుక్‌ మాండవియా అధ్యక్షతన బుధవారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించగా ఇందులో పలువురు వైద్య నిపుణులు ఉన్నతాధికారులు పాల్గొని కరోనా కొత్త వేరియట్ ఒమిక్రాన్ BF-7 ను కట్టడి చేయడానికి తగిన కార్యాచరణను సిద్ధం చేయాలంటూ దిశా నిర్దేశం చేశారు.ఈ తాజా పరిణామాల నేపథ్యంలో కొత్త వేరియంట్‌లను ట్రాక్ చేయడానికి సానుకూల కేసుల మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. దాంతోపాటే పాలు అంతర్జాతీయ విమాన సర్వీసులను ఒక క్రమ పద్ధతిలో తగ్గించుకుంటూ రావాలని సూచించింది,విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ర్యాండమ్‌ టెస్ట్‌లు చేయాలని కేంద్రం ఆదేశించింది

చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్‌ BF-7 వేరియట్ ఇండియాలో కూడా అలజడి సృష్టిస్తోంది.ఇప్పటివరకు ఇండియాలో మూడు ఒమిక్రాన్‌ BF-7 వేరియంట్‌ కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్‌లో రెండు కేసులు నమోదు కాగా మరో కేసు ఒరిస్సాలో వెలుగుచూసింది. దీంతో వైద్యారోగ్య అధికారులు అప్రమత్తం అయ్యారు. కేంద్ర ఆదేశాల మేరకు పలు అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధిస్తూ హై అలర్ట్ ప్రకటించారు.ప్రపంచ ఆరోగ్య నిపుణులు రాబోయే 90 రోజుల్లో చైనాలో 60 శాతానికి పైగా మరియు ప్రపంచ జనాభాలో 10 శాతం మందికి ఒమిక్రాన్‌ BF-7 ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రజలు ఆజాగ్రత్తగా ఉంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అందుకే జలుబు దగ్గు, లక్షణాలు కనిపించిన వెంటనే మాస్కు ధరించి భౌతిక దూరం పాటిస్తూనే వైద్యుని సంప్రదించాలని సూచిస్తున్నారు.