బిగ్ క్వశ్చన్: రాజధాని లేని రాష్ట్రానికి పెట్టుబడులెలా వస్తాయ్.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దావోస్ వెళ్ళారు. రాష్ట్ర ప్రగతిని ప్రపంచానికి చాటి చెప్పి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దావోస్ పర్యటన ఉద్దేశ్యమని అటు ప్రభుత్వం తరఫున, ఇటు పార్టీ తరఫున ప్రచారం జోరుగా సాగుతోంది.

మరి, గతంలో టీడీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసింది కూడా ఇదే కదా.? అంటే, అప్పట్లో చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్లు చేశారు, ఇప్పుడు వైఎస్ జగన్.. పబ్లిసిటీ స్టంట్లకు దూరంగా పని చేస్తున్నారన్నది వైసీపీ వాదన. ఎవరి గోల వారిది.!

గతంలో ‘దావోస్ పర్యటన దండగ.. ఖర్చు దండగ వ్యవహారం..’ అంటూ వైసీపీ విమర్శించిన వైనాన్ని టీడీపీ తెరపైకి తెస్తోంది. దావోస్ పర్యటన అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. జరిగే ఖర్చుల స్థాయిలో అయినా పెట్టుబడులు నిజంగా వస్తాయా.? రావా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.

సరే, ఆ సంగతి పక్కన పెడితే, అసలు దావోస్‌లో మీ రాష్ట్ర రాజధాని ఏది.? అన్న ప్రశ్న వస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఈ ప్రశ్న సబబే. ఎందుకంటే, ఏదన్నా వ్యాపార సంస్థ, ఎక్కడన్నా పెట్టుబడి పెట్టాలంటే ముందుగా ‘రాజధాని’ గురించిన ప్రస్తావన చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని. కానీ, ఆ రాజధానిని అంగీకరించడంలేదు వైసీపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దావోస్ పర్యటనలో రాజధానిపై స్పష్టత ఇస్తారా.? లేదా.? అన్నది చర్చనీయాంశంగా మారింది.