ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యలో మార్పులు, డిగ్రీ తర్వాత నేరుగా పీహెచ్‌డీ..

New implementations in ap education

ఆంధ్రప్రదేశ్‌:ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ల డిగ్రీ తర్వాత నేరుగా పీహెచ్‌డీలో అడ్మిషన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నూతన జాతీయ విద్యా విధానం– 2020 అమలులో భాగంగా ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యలో సమూల మార్పులు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు.

New implementations in ap education

సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ ఓరియెంటేషన్‌ ప్రధాన లక్ష్యంగా ఈ విద్యా సంవత్సరం నుంచే నాలుగేళ్ల హానర్స్‌ డిగ్రీ కోర్సు ప్రారంభిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని కళాశాలలు వచ్చే మూడేళ్లలో నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ), నేషనల్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఏసీ–న్యాక్‌) సర్టిఫికెట్లు సాధించాలన్నారు. అన్ని ప్రభుత్వ కాలేజీలు కూడా తప్పనిసరిగా ఆ గుర్తింపు పొందాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రమాణాలు లేని ఇంజినీరింగ్‌తో సహా, అన్ని కాలేజీలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. మూడేళ్లలో కాలేజీల్లో మార్పు రాకపోతే, చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ప్రమాణాలు పాటించని ఇంటర్మీడియట్‌ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

అలాగే బీఈడీ కాలేజీలు కచ్చితంగా ప్రమాణాలు పాటించి తీరాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. టీచర్‌ ట్రయినింగ్‌ సంస్థల్లో క్వాలిటీ లేకపోతే నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలన్నారు. టీచర్ల శిక్షణలోనే నాణ్యత లేకపోతే వారు పిల్లలకు పాఠాలు ఎలా చెబుతారని ప్రశ్నించారు.

ఇకపై రాష్ట్రంలో ఏడాది లేదా రెండేళ్ల పీజీ ప్రోగ్రాములు ఉండాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. అలాగే మూడు లేదా నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని ఆదేశించారు. 4 ఏళ్ల డిగ్రీ పూర్తి చేసిన వారికి నేరుగా పీహెచ్‌డీలో అడ్మిషన్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రోగ్రామ్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే వచ్చే ఏడాది నుంచి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్స్ ఉండాలన్నారు.

విద్యార్థులకు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉన్నత విద్యలో అడ్వాన్స్‌డ్‌ టాపిక్స్‌తో కోర్సులు రూపొందించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. రొబోటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా అనలటిక్స్‌ వంటి కొత్త కోర్సులు ప్రారంభించాలన్నారు. బీకాంలో సెక్యూరిటీ (స్టాక్‌) అనాలిసిస్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వంటి అంశాలు కూడా ఉండాలన్నారు.