MLA Sensational Comments : అత్యాచారం అనివార్యమైతే.. ఏం చేయాలంటే.!

MLA Sensational Comments : అత్యాచారం అనివార్యమైతే, ఆస్వాదించాల్సిందే.. అంటూ ఓ శాసన సభ్యుడు వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. కర్నాటకలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పెను రాజకీయ దుమారం చెలరేగుతోంది. అసెంబ్లీ సమావేశంలో చర్చను పొడిగించాలంటూ ఎమ్మెల్యల నుంచి స్పీకర్ మీద తీవ్రమైన ఒత్తిడి నెలకొంది.

‘తలకు మించిన భారం’లా వ్యవహారం మారుతున్న దరిమిలా, ‘నేనెలాంటి పరిస్థితిలో వున్నానంటే..’ అంటూ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్దే గేరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘అన్నింటినీ ఆస్వాదిస్తూ.. అవును.. అవును అంటూ వుండాలి అంతే..’ అని స్పీకర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సీనియర్ శాసనసభ్యుడు, మాజీ స్పీకర్ రమేష్ కుమార్ స్పందిస్తూ, ‘రేప్’ అంశాన్ని ప్రస్తావించారు.

‘అత్యాచారం అనివార్యమైనప్పుడు ఆనందంగా దాన్ని ఆస్వాదించాలి అని ఓ సామెత వుంది. మీరిప్పుడు సరిగా అలాంటి పరిస్థితుల్లోనే వున్నారు..’ అంటూ శాసనసభ్యుడు రమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. అంతే, రమేష్ కుమార్ మీద ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు, మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి.

నిజానికి, అది ఓ సామెత మాత్రమే. సామెతనే ప్రస్తావించారు శాసన సభ్యుడు రమేష్ కుమార్. రమేష్ కుమార్ అంటే, కర్నాటక రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్లలో ఒకరు. అలాంటి వ్యక్తి నోట ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు రావడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

మహిళలపై వివాదాస్పద కామెంట్లు ఇటీవల సర్వసాధారణమైపోయాయి. రేప్.. అత్యాచారం.. ఈ రెండిటి చుట్టూ జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ప్రజా ప్రతినిథులు కావొచ్చు, ఇతర రాజకీయ నాయకులు కావొచ్చు.. ఇలాంటి విషయాల్లో కాస్తంత ఆచి తూచి వ్యవహరించాల్సిందే.. సామెతలు చెప్పే విషయంలో ఇంకాస్త అప్రమత్తంగా వుండాలి.