Kamal Haasan: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కమల్ హాసన్ వర్సెస్ కన్నడిగుల వార్ గురించే వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు. కన్నడ ప్రజలు హీరో కమల్ హాసన్ పై మండిపడుతున్నారు. ఈ వివాదం రోజురోజుకీ ముదురుతూనే ఉంది తప్ప సద్దుమణిగేలా కనిపించడం లేదు. థగ్ లైఫ్ సినిమా ఈవెంట్ లో భాగంగా కమల్ హాసన్ చేసిన వాఖ్యలు ఈ వివాదానికి తెరలేపాయి. చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది అని కమల్ హాసన్ అన్నారు.
ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఇప్పటికే ఈ విషయంపై కమల్ హాసన్ స్పందిస్తూ తన మాటలను తప్పుగా అపార్థం చేసుకున్నారు అంటూ వివరణ కూడా ఇచ్చారు. మరోవైపు కన్నడిగులు క్షమాపణలు చెప్పాల్సిందే లేదంటే సినిమాను ఆపేస్తాం విడుదల కానివ్వం అంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. తన వ్యాఖ్యలను కమల్ సమర్ధించుకోవడంతో కన్నడిగులు ఆగ్రహం మరింత ఎక్కువైంది. కర్ణాటకలో కన్నడ సంఘాలు, అభిమానులు నిరసనలు చేపట్టారు. థగ్ లైఫ్ సినిమా బ్యానర్లను చించివేయడం, కమల్ దిష్టిబొమ్మలను దహనం చేయడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి.
కమల్ హాసన్ మే 30, 2025లోగా క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో విడుదల చేయడాన్ని నిషేధిస్తామని KFCC హెచ్చరించింది. కమల్ హాసన్ పై కర్నాటక హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినప్పటికి సారీ చెప్పడానికి కమల్ నిరాకరించారు. నేను తప్పుగా మాట్లాడలేదు.. క్షమాపణ చెప్పను.. థగ్ లైఫ్ సినిమాను కర్నాటకలో విడుదల చేయడం లేదు అని కమల్ అన్నారు. థగ్ లైఫ్ సినిమా విడుదలపై హైకోర్టులో కమల్ పిటిషన్ దాఖలైంది. కానీ కమల్ హాసన్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. తాను క్షమాపణ చెప్పేదే లేదని కర్ణాటకలో తన సినిమా రిలీజ్ చేయను అని పట్టు బట్టుకొని కూర్చున్నారు. మరి ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి మరి.