కర్ణాటకలో టీ, కాఫీ, పాలు అమ్మకాలు బంద్.. ఎందుకంటే..?

కర్ణాటకలో టీ కాఫీ అభిమానులకు ఇది షాక్ ఇచ్చే న్యూస్..జీఎస్‌టీ నోటీసులపై ఆగ్రహంతో చిరు వ్యాపారులు రాష్ట్ర వ్యాప్తంగా తాత్కాలికంగా టీ, కాఫీ విక్రయాలను నిలిపి వేశారు. ప్రభుత్వ విధానాలపై నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి కేఫ్‌లు, బేకరీల్లో కేవలం బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ మాత్రమే విక్రయిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

తాము లక్ష్యంగా మారామంటూ, అన్యాయం జరుగుతోందంటూ చిన్న వ్యాపారులు గళం విప్పారు. ‘‘జీఎస్‌టీ అధికారులు మాకు ఊహించని విధంగా నోటీసులు పంపిస్తున్నారు. డిజిటల్ లావాదేవీలను ఆధారంగా చేసుకుని పెద్ద సంఖ్యలో జరిమానాలు విధిస్తామంటూ బెదిరిస్తున్నారని’’ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చాలా దుకాణదారులు యూపీఐ, ఆన్‌లైన్ చెల్లింపులను నిలిపేసి కేవలం నగదు మాత్రమే తీసుకుంటున్నారు.

కర్ణాటకలో ముఖ్యంగా చిన్న కాఫీ హోటల్స్, టీ స్టాళ్లు, చిన్న బేకరీలు లక్షలాది మంది రోజువారీ కస్టమర్లకు సేవలు అందిస్తుంటాయి. ఇప్పుడు ఈ అడ్డుపడుదలతో సాధారణ ప్రజలకు అసౌకర్యం తప్పడంలేదు. దీనిపై వివాదం ముదరడంతో సీఎం సిద్ధరామయ్య స్పందించారు. సమస్య పరిష్కారానికి చర్చలు జరపాలని వ్యాపారుల ప్రతినిధులను తన నివాసానికి పిలిపించారు. బుధవారం మధ్యాహ్నం నుంచి సీఎం ఇంట్లో ఈ భేటీ కొనసాగుతోంది. తమ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లిన ప్రతినిధులు నోటీసులు వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అని స్పష్టంగా చెప్పేశారు.

ఇక జీఎస్‌టీ అధికారులు 2021 నుంచి 2024 మధ్య యూపీఐ, డిజిటల్ లావాదేవీల ఆధారంగా ప్రత్యేక ఆడిట్ డ్రైవ్ చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చే ఆదాయం రూ. 20 లక్షలు (సేవల కోసం), రూ. 40 లక్షలు (వస్తువుల కోసం) దాటితే వ్యాపారులు జీఎస్‌టీకి తప్పనిసరిగా రిజిస్టర్ అయ్యి పన్ను చెల్లించాలని అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. అందులో భాగంగానే వేలాది చిరువ్యాపారులకు నోటీసులు జారీ అయ్యాయి.

ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకుంటే ఈ నెల 25న రాష్ట్రవ్యాప్త బంద్‌కు దిగి ఆందోళన మరింత ముదురుస్తామని వ్యాపారులు హెచ్చరించారు. ఇక చర్చలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి. ఒకవైపు వ్యాపారుల ఆందోళన, మరోవైపు వినియోగదారుల అసౌకర్యం — ఈ సమస్యకు పరిష్కారం ఎంత త్వరగా దొరుకుతుందో కర్ణాటకలోని టీ కాఫీ ప్రేమికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.