తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసుపై మంత్రి కేటీఆర్ స్పందించారు. లాయర్ల హత్య చాలా బాధాకరమని ఆయన అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్‌ఎస్ లీగల్ సెల్ సమావేశంలో మాట్లాడిన ఆయన.. మంత్రి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి తమ పార్టీ చెందినవాడేనని తెలిసి, వెంటనే తొలగించామని చెప్పారు. హత్యతో ప్రమేయం ఉన్న వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
శాంతిభద్రతల విషయంలో సీఎం కేసీఆర్ కఠినంగా ఉన్నారని.. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం తప్పకుండా కృషి చేస్తామని ఆయన హామీనిచ్చారు. వామన్‌రావు హత్య కేసును రాజకీయంగా వాడుకుంటున్నారని విపక్షాలపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. న్యాయవాదుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది తెలంగాణ న్యాయవాదులేనని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. లాయర్ల కోసం తమ ప్రభుత్వం రూ.100 కోట్లతో నిధిని ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో పట్టపగలు.. నడిరోడ్డుపై వందలాది మంది చూస్తుండగా హైకోర్టు న్యాయవాది దంపతుల హత్య కలకలం రేపింది. ఈ హత్య కేసులో పోలీసులు తవ్విన కొద్దీ సంచలన విషయాలు వెలుగుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ హత్యల వెనుక ప్రధానంగా కీలకమైన టీఆర్ఎస్ నేతల హస్తం ఉన్నట్టు సమాచారం. ప్రధానంగా హైకోర్టు లాయర్ వామన్ రావు చనిపోతూ తనను టీఆర్ఎస్ నేత కుంట శ్రీనివాస్ చంపాడని వాంగ్మూలం ఇచ్చారు. దీంతో కుంట శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కుంట శ్రీనివాస్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా ఉన్నాడు. కొంతకాలంగా కుంట శ్రీనివాస్ తో హైకోర్టు న్యాయవాది వామన్ రావుకు విభేదాలు ఉన్నాయి. వామన్ రావు స్వగ్రామం గుంజపడుగులో ఇద్దరి మధ్య భూవివాదం ఉన్నట్టు తెలిసింది. అదే హత్యకు దారితీసింది.