90 సీట్లలో టీఆర్ఎస్ గెలుస్తుంది: కేటీయార్ ఉవాచ

తెలంగాణ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారంపైనా, ఈ క్రమంలో వెలుగు చూస్తోన్న సర్వేల ఫలితాలపైనా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ.. ఇలా రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలూ ముందస్తు ఎన్నికల కోసం తెగ ఉబలాటపడుతున్నాయి. సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ముందస్తు ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోడీకి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్, బీజేపీ కూడా, ‘దమ్ముంటే రాజీనామా చెయ్..’ అంటూ కేసీయార్‌కి సవాళ్ళు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపో మాపో కేసీయార్, ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ఎన్నికలకు వెళతారంటూ రాజకీయ జోస్యాలూ మొదలయ్యాయి.

కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మాటలు ఇంకోలా వున్నాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని చెప్పారాయన. అంతే కాదు, 2023లో షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనీ కుండబద్దలుగొట్టేశారు.

ఇదిలా వుంటే, రాష్ట్రంలో వెలుగు చూస్తోన్న పలు సర్వేలపై కేటీయార్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సమితికి 90 సీట్లు వస్తాయని తమ సర్వేలో తేలిందని చెప్పారాయన. కేసీయార్ మరోమారు ముఖ్యమంత్రి అవుతారనీ, తాము హ్యాట్రిక్ కొట్టబోతున్నామనీ కేటీయార్ చెప్పుకొచ్చారు.