మోడీ సర్కారుకి ఛాలెంజ్ విసిరిన కేటీయార్.!

KTR

తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళుతున్న ఆదాయమెంత.? కేంద్రం, తెలంగాణ రాష్ట్రానికి తిరిగిచ్చినదెంత.? అంటూ తెలంగాణ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, ఢిల్లీ వేదికగా, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

‘కేంద్రం తెలంగాణ నుంచి రూపాయి తీసుకుంటే, అందులో కేవలం 46 పైసలు మాత్రమే తెలంగాణకు ఇస్తోంది..’ అని చెప్పిన కేటీయార్, తాను చెప్పింది అబద్ధమైతే, అది అబద్ధమని బీజేపీ నిరూపించగలిగితే, మంత్రి పదవికి రాజీనామా చేసి ఢిల్లీ నుంచి నేరుగా ఇంటికి వెళ్ళిపోతానని కేటీయార్ స్పష్టం చేశారు.

తెలంగాణ మంత్రి కేటీయార్, టీఆర్ఎస్ తరఫున రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష కూటమి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకి మద్దతు పలికేందుకు ఢిల్లీకి వెళ్ళిన సంగతి తెలిసిందే. రామ్‌నాథ్ కోవింద్‌ని రాష్ట్రపతిని చేసి, దేశంలో దళితులందర్నీ ఉద్ధరించేశామని బీజేపీ చెప్పుకోవడం హాస్యాస్పదమని కేటీయార్ ఎద్దేవా చేశారు.

‘తెలంగాణలో దళిత బంధు అమలు చేస్తున్నాం.. దళితులకు కేంద్రం ఏం చేసింది.?’ అని ప్రశ్నించిన కేటీయార్, తెలంగాణ పట్ల కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. ‘తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే అతి పెద్ద, క్లిష్టతరమైన కాళేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టుని పూర్తి చేసింది.. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టుని కేంద్రం పూర్తి చేయగలిగిందా..?’ అని కేటీయార్ ప్రశ్నించడం గమనార్హం.

ఇంతకీ, కేటీయార్ సవాల్‌పై బీజేపీ స్పందిస్తుందా.? తెలంగాణకు కేంద్రం ఏమేమి ఇచ్చిందో చెప్పి, కేటీయార్ రాజీనామా చేసేలా ఒత్తిడి తీసుకురాగలుగుతుందా.?