Kodali Satire : గుడివాడ కాసినో.. ఎఫ్‌బీఐతో విచారణ చేయించాలా.?

Kodali Satire : గుడివాడలో కాసినో వ్యవహారాన్ని స్థానిక టీడీపీ నేతలే పట్టించుకోవడంలేదంటూ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. కొందరు క్యాబరేగాళ్ళు (టీడీపీకి చెందిన కొందరు నేతల్ని ఉద్దేశించి) కొన్ని రోజులపాటు అనవసరపు హంగామా చేశారంటూ కొడాలి నాని మండిపడ్డారు.

సదరు క్యాబరేగాళ్ళు జో బైడెన్ వద్దకు వెళ్ళి క్యాసినోపై విచారణ చేయమంటారేమోనంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, మంత్రి బాధ్యతారాహిత్యంతో చేసిన వ్యాఖ్యల పట్ల విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

గుడివాడ కాసినో ఘటనపై రాష్ట్ర పోలీసులు విచారణ చేపట్టకపోవడమేంటి.? అన్న చర్చ తెరపైకొస్తోంది. సంక్రాంతి పండక్కి ప్రతి యేటా ఇలాంటివి జరుగుతాయని మంత్రి కొడాలి నాని స్వయంగా వెల్లడించారు. తన కన్వెన్షన్ సెంటర్ పక్కనే వున్న స్థలంలో కాసినో జరిగిందనీ ఆయన చెబుతున్నారు.

అసభ్యకర డాన్సులు వేస్తున్నారన్న సమాచారంతో పోలీసులకు తానే ఫిర్యాదు చేశాననీ కొడాలి చెప్పారు. మరి, పోలీసులు ఎవర్నయినా అరెస్టు చేశారా.? అంటే, ఇప్పటిదాకా పోలీసుల నుంచి స్పష్టత లేదు.

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా కాసినో జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో పలు చోట్ల వైసీపీ మద్దతుదారులు వీటిని నిర్వహించినట్లు వల్లభనేని వంశీ చెప్పడం గమనార్హం. అయినా, పోలీసులు ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర ప్రజలకు ఖచ్చితమైన సమాచారం, సమాధానం అయితే ఇవ్వడంలేదు.