ప్రపంచ దేశాల అధ్యక్షులంతా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాజ్యాన్ని కాపాడుకునే భాగంలో తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో పడాల్సి వచ్చింది. ప్రజల ప్రాణాలే మిన్న అని లాక్ డౌన్ వంటి చర్యలు తీసుకున్నారు. వీలైనంత వరకూ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసారు. చివరికి వ్యాక్సిన్ ఇప్పుడప్పుడే రాదన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన దేశాలు లాక్ డౌన్ ఎన్నాళ్లు పెట్టుకుని కూర్చుంటామని చివరికి నిర్ణయం మార్చుకుని ప్రజల్ని స్వేచ్ఛగా వదిలేసారు. ఇక ఎవరి జాగ్రత్తలు వారి తీసుకోండి..మీ ప్రాణం మీ చేతుల్లోనే ఉందని చెప్పకనే చెప్పేసారు. ఇందులో భారత్ కూడా ఉంది. మూడు నెలల పాటు పటిష్టంగా లాక్ డౌన్ ని అమలు చేసిన భారత్ చివరికి అన్ లాక్ చేసి వదిలేసింది.
ఎవరి రాష్ర్టం బాధ్యతలు వారివే అంటూ రాష్ర్టాల మీదకు తోసేసింది. జాతీయ విపత్తుగా ప్రకటించిన మహమ్మారి ఇప్పుడు మనుషులకు సోకితే ఎవరి డబ్బు పెట్టి వాళ్లే వైద్యం చేయించుకునే పరిస్థితి చేరుకుంది భారత్. లాక్ డౌన్ తో ఆర్ధికంగా చితికిపోవడం తప్ప ఒరిగేదేమి ఉండదని అగ్ర రాజ్యం అమెరికా ముందే విషయాన్ని గ్రహించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజలుప్రాణాలు కన్నా! నెంబర్ వన్ స్థానం మాత్రమే ముఖ్యమని కరోనాని లైట్ తీసుకున్నారు. ప్రపంచ దేశాలపై చైనా పెత్తనం చెలాయించకూడదనే అగ్ర రాజ్య అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ నేపథ్యంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. నిజానికి ట్రంప్ అలా చేయడం ప్రపంచ దేశాలకు మంచిదే అయింది. లేదంటే పొగరబోతులా రంకెలేసే చైనా ప్రపంచ వినాషనానికే కంకణం కట్టుకునేది అన్నది వాస్తవం. సరిహద్దు దేశాల్ని ఆక్రమించుకుని పెత్తనం చెలాయించేది. ఆ విషయం పక్కనబెడితే !
భారత్ లో ఇప్పుడు కరోనా పరిస్థితి ఆందోళన కరంగా మారిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా దక్షిణాదిన అందులోనూ తెలుగు రాష్ర్టాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత పదిహేను రోజులుగా తెలంగాణలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. వైరస్ కట్టడి విషయంలో కేసీఆర్ సర్కార్ తొలి నుంచి కేంద్రానికి, కోర్టులకు దొంగ లెక్కలు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషంయలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. టెస్టులు చేయడంలో, రోగులకు సరైన వైద్యం అందించడంలోనూ, ఆసుపత్రులు కేటాయింపు వంటి చర్యల్లో విఫలమైందని విమర్శలు మోస్తోంది. ఇక తాజాగా జీహెచ్ ఎంసీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో? తెలిసిందే.
సీఎం కేసీఆర్ పది రోజులుగా పత్తా లేకుండా పోయారు. నేరుగా తెలంగాణ గవర్నర్ తమిళసై రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో కేసీఆర్ ని దగ్గరగా చూసిన వారంతా ట్రంప్ వ్యూహం తో కేసీఆర్ ముందుకెళ్తున్నట్లు భావిస్తున్నారు. కరోనా తో కలిసి బ్రతకాల్సిందేనని కేసీఆర్ ఓ సందర్భంలో అన్న సంగతి తెలిసిందే. తెలంగాణాకి కరోనా వచ్చినప్పటి పరిస్థితులు..తాజా పరిస్థితులను..కేసీఆర్ వ్యవరించిన తీరు చూస్తుంటే! ట్రంప్ ఐడియాలతో కేసీఆర్ ముందుకెళ్తున్నారా? అన్న సందేహం కల్గుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అన్నట్లు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ అమెరికా నుంచి ఢిల్లీ అటుపై హైదరాబాద్ పర్యటన కు వచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం సిటీలో కొత్తగా రోడ్లు వేసి సాధనంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.