కౌరవ సభా.? గౌరవ సభా.? చంద్రన్న అక్కసు ఏంటి.!

రాజకీయాల్లో విమర్శలు సహజాతి సహజం. ఆ విషయం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికే బాగా తెలుసు. నిజానికి, రాజకీయాలు ఇంతలా తెలుగు నాట భ్రష్టుపట్టిపోవడానికి ప్రధాన కారణాల్లో చంద్రబాబు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంటుంది.

సరే, చంద్రబాబు సతీమణి మీద వైసీపీ నేతలు చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యల్ని సభ్య సమాజం హర్షించదనుకోండి.. అది వేరే సంగతి. ‘అబ్బే, మేం ఏమీ అనలేదు..’ అని అధికార పార్టీ బుకాయిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

‘ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ..’ అంటూ అసెంబ్లీ సాక్షిగానే చంద్రబాబు నినదించారు. ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే అసెంబ్లీకి వస్తానంటూ, అసెంబ్లీకి గుడ్ బై చెప్పేశారు కూడా. అయితే, సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు, చట్ట సభల్ని ఉద్దేశించి ‘కౌరవ సభ’ అనడం సబబు కాదు.

చంద్రబాబు హయాంలోనూ చట్ట సభలు అధ్వాన్నంగానే నడిచాయి. అవి ఇంకాస్త అధ్వాన్నంగా ఇప్పుడు నడుస్తున్నాయంతే. అన్ని వ్యవస్థల్లోనూ మార్పులొచ్చినట్లే.. శాసన వ్యవస్థల్లోనూ అత్యంత దారుణమైన మార్పులు వచ్చాయి, వస్తున్నాయి.. వస్తూనే వుంటాయి.

మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి వుందా.? అంటే, ఏమో.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. కానీ, టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు తదితరులు ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఎలాంటి భాష ప్రయోగిస్తున్నారో చూస్తున్నాం. అలాంటివారిని వారించని చంద్రబాబు, సభ్య సమాజానికి ఏం సంకేతాలు ఇస్తున్నట్టు.?

పార్టీలో నేతలకు బూతుల విషయమై పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసి, అలాంటి బూతులు తన మీద.. తన కుటుంబ సభ్యుల మీదకు అవతలి వైపు నుంచి వస్తోంటే, చట్ట సభల్ని ఉద్దేశించి ‘కౌరవ సభ’ అనడం హాస్యాస్పదమే మరి.