షర్మిల పార్టీ పేరు ఇదే ? జగన్ రియాక్షన్ ఏంటి !

తెలంగాణ లో కొత్త పార్టీ రాబోతుంది అనే వార్త ప్రకంపనలు సృష్టిస్తుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నారంటూ వస్తున్న వార్తలపై జనాలు జోరుగా చర్చించుకుంటున్నారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టకపోవచ్చని కొందరు… రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని మరికొందరు వాదిస్తున్నారు. అయితే తాను పార్టీ పెడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై వైఎస్ షర్మిల మౌనంగా ఉండటం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

మౌనం ఉండటం సగం అంగీకారమని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో షర్మిల సైలెంటుగా ఉన్నారంటే.. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారన్నది నిజమేనన్న అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. వైఎస్ షర్మిల కొత్త పార్టీ ప్రచారంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్పందించారు. షర్మిలలో ప్రవహించేది కూడా వైఎస్ రక్తమేనని, అందుకే ఆమె పార్టీ ఆలోచన చేస్తున్నట్టుందని సీనియర్ నేత వీ హనుమంతరావు అభిప్రాయపడ్డారు. విశాఖ టికెట్ ఇవ్వకుండా షర్మిలకు జగన్ అన్యాయం చేశాడని ఆయన ఆరోపించారు. అయితే షర్మిల కొత్త పార్టీని ఏపీలో స్థాపించడం మేలని, జగన్ పై ప్రతీకారంతోనే పార్టీ పెట్టదలచుకుంటే ఏపీనే అనువైన ప్రాంతమన్నారు. షర్మిల పార్టీ ప్రజావసరమో కాదో తెలియదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

షర్మిల పార్టీ ప్రచారంపై తనదైన శైలిలో స్పందించారు సీపీఐ అగ్రనేత నారాయణ. పవన్ కల్యాణ్ తెలంగాణలో పార్టీ నడుపుతున్నప్పుడు షర్మిల కొత్త పార్టీ పెట్టడంలో తప్పేముందని అన్నారు. షర్మిల కొత్త పార్టీ పెట్టినప్పుడు సీపీఐ వైఖరి తెలియజేస్తామని వెల్లడించారు.